మంత్రి ఆదినారాయణ రెడ్డి సవాల్ కి తాము సిద్ధంగా ఉన్నామని  వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ చరిత్రపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.  దొడ్డిదారిన మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి నిజంగా కడప రెడ్డి అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సుధాకర్‌ బాబు డిమాండ్‌ చేశారు.

వైఎస్ కుటుంబంపై విమర్శలు చేస్తే  చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే చంద్రబాబు చరిత్ర, వైఎస్‌ఆర్‌ చరిత్రపై చర్చించేందుకు సిద్దమా అని చాలెంజ్‌ చేశారు. శనివారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మంత్రులు విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని, చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి పంది బురదలో దొర్లినట్లు దొర్లుతూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.