వచ్చే నెల6 నుంచి జగన్ పాదయాత్ర టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలపై జగన్ కన్ను టీడీపీని దెబ్బతీసేందుకు సన్నాహాలు

చంద్రబాబు ఎత్తులకు.. జగన్ పై ఎత్తులు వేస్తున్నారా..? వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేసేందుకు వైసీపీ వ్యూహం సిద్ధం చేస్తోందా..? అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీలో ద్వితీయ శ్రేణి నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అధినేత జగన్ ప్రణాళికలు రచిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే .. ఆకర్ష్ పేరిట చంద్రబాబు.. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను తమ పార్టీలోకి లాక్కుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వారిలో నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అయితే.. దీనిని ఎదుర్కోనేందుకు జగన్ మాష్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. వచ్చే నెల6వ తేదీ నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ పాదయాత్ర మొదలౌతోంది.

కాగా.. ఆ పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానుంది. అయితే.. నియోజకవర్గాల వారిగా సాగనున్న ఈ యాత్రలో టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారట. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి తమ నియోజకవర్గంలో చాలా పట్టు ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఎమ్మెల్యేకి అంత పట్టు ఉందంటే.. అసలు కారణం మండల స్థాయి నేతలే. ఆ మండల స్థాయి నేతల మద్దతే లేకపోతే.. ఎమ్మెల్యే బలం శూన్యం. అందుకే.. జగన్ మండల స్థాయి నేతలను టార్గెట్ చేసుకున్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను, ఎంపీలను లాక్కుంటే.. వారికి అసలు ఆయువుపట్టు అయిన ద్వితీయ శ్రేణి నేతలను తమ పార్టిలోకి ఆహ్వానించాలనుకుంటున్నారు జగన్.

కేవలం టీడీపీ నేతలనే కాకుండా. కాంగ్రెస్ నేతలను కూడా పాదయాత్రలో ఆయనే స్వయంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించాలనుకుంటున్నారని సమాచారం. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గాల్లో కసరత్తు కూడా మొదలైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.జగన్ మాష్టర్ ప్లాన్ కనుక సక్సెస్ అయితే.. ఈ సారి సీఎం పదవి జగన్ కైవసం కావడం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు.