Asianet News TeluguAsianet News Telugu

టీడీపీలో జగన్ కి మద్దతు పెరుగుతోందా?

  • జగన్ కి మద్దతుగా మాట్లాడుతున్న మంత్రులు
  • జగన్ కి ప్రజాకర్షణ ఉందన్న ఉపముఖ్యమంత్రి కేఈ
  • జగన్ పాదయాత్రను స్వాగతిస్తానన్న మంత్రి అచ్చెన్నాయుడు
ycp leader jagan gets support from tdp leaders

వైసీపీ అధ్యక్షుడు జగన్ కి టీడీపీలో మద్దతు పెరుగుతోందా..? అవుననే అనిపిస్తోంది. మొన్నటికి మొన్న.. ‘జగన్ కి  ప్రజాకర్షణ’ ఉంది అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. తాజాగా.. మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రను తాను స్వాగతిస్తున్నాను అంటూ చెప్పారు. మొన్నటి దాకా జగన్ మీద ఒంటికాలుతో ఎగిరిన మంత్రి ఇప్పుడు సానుకూలంగా మాట్లాడటంతో టీడీపీలో గందరగోళం నెలకొంది.

అసలు విషయం ఏమిటంటే.. వైసీపీ అధినేత జగన్ వచ్చే నెల 6వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆయన పాదయాత్ర చేస్తానని ప్రకటించిన నాటి నుంచి టీడీపీ నేతలు జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ చేయాల్సింది పాదయాత్ర కాదని..జైలు యాత్ర అని కూడా విమర్శించారు. దీంతో.. జగన్ పాదయాత్ర  అంటే టీడీపీ నేతలు భయపడుతున్నారు అని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.  ఆ ఎదురుదాడిని తట్టుకునేందుకు మంత్రి అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు.

జగన్ ను విమర్శిస్తే.. తమకే నష్టం కలుగుతుంది అని అనుకున్నాడో ఏమో..? జగన్ పాదయాత్ర చేస్తే తమ పార్టీకే లాభం చేకూరుతుందని చెప్పాడు. అందుకే ఆ పాదయాత్రను తాను స్వాగతిస్తున్నా అని కూడా చెప్పాడు. అయితే.. జగన్ పాదయాత్ర చేస్తే ఆయన పార్టీకి ఎలా లాభం చేకూరుతుందో మాత్రం మంత్రి చెప్పలేదు.

 అసలు జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు..? ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ తన మద్దతు పెంచుకోవడానికే కదా? అప్పుడు జనాల్లో టీడీపీ మీద వ్యతిరేకత మొదలయ్యే అవకాశం ఉంది.. అది టీడీపీకి నష్టమే కానీ లాభం ఎలా అవుతుంది? ఏ కోణంలో లాభం వస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నాడో అర్థం కాక ఆ పార్టీ నేతలు కూడా బుర్రలు గోక్కుంటున్నారు.

అంతేకాకుండా.. జగన్ మీద వ్యతిరేకతతో తాను ఇలా మాట్లాడటం లేదని మంత్రి అన్నారు. నిజాలు బయటపెట్టేందుకు జగన్ పై తమ పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెడుతున్నామంటూ చెప్పుకొచ్చారు. జగన్ పాదయాత్రకు బదులు.. పొర్లు దండాల యాత్ర చేసినా  కూడా ఉపయోగం ఉండదని ఆయనే మళ్లీ జోస్యం చెప్పారు. గతంలో చంద్రబాబు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డిలు పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన సంగతి మంత్రి మర్చిపోయారేమో.

Follow Us:
Download App:
  • android
  • ios