చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. బుధవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రెడ్ మీ నోట్ 5, రెడ్ మీ నోట్ 5 ప్రో ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ల కోసం షియోమి అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. కాగా.. షియోమి ఈ రెండు ఫోన్లను బడ్జెట్ ధరలోనే వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. వచ్చే వారంలో ఈ ఫోన్లు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అమ్మకానికి రానున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ ఫోన్లపై టెలికాం  సంస్థ జియో.. ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

షియోమీతో భాగస్వామ్యం అయిన జియో ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.  షియోమీ రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ ఫోన్లను కొన్నవారు వాటిల్లో జియో సిమ్ వేసి రూ.198 లేదా రూ.299 ప్లాన్‌లతో మై జియో యాప్‌లో రీచార్జి చేసుకుంటే వారికి రూ.2200 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ 44 వోచర్ల రూపంలో లభిస్తుంది. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తరువాత చేసుకునే రూ.198, రూ.299 రీచార్జిలపై వాడుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇక రూ.198 అంతకన్నా ఎక్కువ విలువ గల ప్లాన్లను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు డబుల్ మొబైల్ డేటా లభిస్తుంది. మొదటి 3 రీచార్జిలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే.. వినియోగదారులు రూ.198 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే ఒక్కోసారి 112 జీబీ డేటా చొప్పున మొత్తం 3 సార్లకు గాను 336 జీబీ డేటా వస్తుందన్నమాట.