నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి  బాలయ్య వస్తున్నారా లేదా అనేది గోప్యంగా ఉంచుతున్నారు. ప్రచారంలో పాల్గొనడం బాలయ్యకు ఇష్టం లేదని ఒక వర్గం చెబుతున్నది. మరొక వర్గం ఆయన రావాలని తేదీలను కూడా ఖరారు చేసింది గెలవాలంటే బాలయ్యను కూడా నంద్యాలలో తిప్పాల్సిందేనని ఇంకొందరంటున్నారు  

ఒక్క పేరు నంద్యాల లో వినిపించడంలేదు. అక్కడు మంత్రులున్నారు, రూలింగ్ పార్టీ ఎంపిలున్నారు, ఎమ్మెల్యేలున్నారు, వీళ్లు కాకుండా బలమున్న లీడర్లు కూడా ఉన్నారు. చివరకు మంచానపడ్డ లోకల్ ఎంపి ఎస్పీవై రెడ్డి వీలు ఛైర్ లోొ కూర్చునే ప్రచారం చేస్తున్నారు.

అయితే, ఒక వెలితి స్పష్టంగా కనిపిస్తున్నదని తెలుగుదేశం నేతలంటున్నారు.

నంద్యాల ప్రచారానికి అపుడపుడూ ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు. నారా లోకేశ్ కూడా ఒక రౌండేసి వెళ్లారు.

అయినా ఆ వెలితి కనిపిస్తూ ఉందని కర్నూలు జిల్లా టిడిపి నేతలు చెబుతున్నారు

నంద్యాల ఆ వినిపించని, కనిపించని మనిషి... ఎవరో కాదు, నందమూరి బాల కృష్ణ. హిందూపూరం శాసన సభ్యుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరది. అభిమానులకు బాలయ్య.

బావకు తోడుగా ఆయన నంద్యాలలో క్యాంపెయిన్ చేయరా?

బావ ఇంత కష్టపడుతుంటే బాలయ్య ఎక్కడో షూటింగులో ఇరుక్కుపోతే ఎలా?

ఆయన ఒకసారి వస్తే పరిస్థితి మారిపోతుందని ఆశపడ్తున్నారు.

మరి బాలయ్య ,నంద్యాల వైపు వస్తాడా లేదా...

ఒక సీనియర్ తెలుగుదేశం నాయకుడు,నంద్యాల ఎన్నికల మేనేజర్లలో ఒకరయిన నాయకుడు ఏషియానెట్ కు ఇలా చెప్పారు.

‘ మేం బాల కృష్ణ ఒక రౌండు సుడిగాలి పర్యటన చేయాలని కోరాం. ఆగస్టు 16,17,18తేదీలలో ఒక రోజు వచ్చి పోవాలని తేదీలు కూడా సూచించారు. ఇవన్నీ ఆయనకు చేరాయి. ఆయన నుంచి ఇంకా రెస్పాన్స్ లేదు. వస్తారని పార్టీ నేతులు, కార్యకర్తులు నంద్యాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆయన ఒక రౌండ్ ప్రచారం చేస్తే టిడిపి బంపర్ మెజారిటీతో గెలుస్తుంది,’ అని చెప్పారు.

బాలయ్యను నంద్యాల ప్రచారానికి ఆహ్వనించారా అని అడిగితే, నిజమేనని చెప్పారు, జిల్లా టిడిపి అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.

‘ ఈ తేదీలలో మేం బాలకృష్ణ గారిని ఆహ్వనించాం. వస్తారని ఆశిస్తున్నాం,’ అని క్లుప్తంగా సోమిశెట్టి చెప్పారు.

అయితే, పార్టీలోని ఒక మంత్రి మాత్రం బాలయ్య రాకపోవచ్చని, ఆయన అవసరం లేకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.