న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా బిజెపి శాసనసభా పక్ష నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని ఆపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రమాణ స్వీకారానికి యడ్యూరప్పను గవర్నర్ వాజుభాయ్ వాలా ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెసు, జెడిఎస్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ బుధవారం రాత్రిపూట సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కాంగ్రెసు సీనియర్ నేత, న్యాయవాది సింఘ్వీ సుప్రీంకోర్టును కోరారు. దీంతో అప్పటికప్పుడు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎకే సిక్రీ, జస్టి ఎస్ఎ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్ లతో ఆయన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారు జామున 2 గంటలకు కోర్టు విచారణ ప్రారంభించింది.

సుప్రీంకోర్టు తెల్లవారు జామున 3.20 గంటల వరకు వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తరఫున ఎజి కెకె వేణుగోపాల్, అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలు వినిపించారు. బిజెపి, యడ్యూరప్ప తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 

బలనిరూపణకు 15 రోజుల గడువు ఎలా ఇస్తారని సింఘ్వీ ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశం ఇవ్వడమేనని సింఘ్వీ వాదించారు. ఇటువంటి వ్యవహారంలో గతంలో కోర్టు 48 గంటల గడువు మాత్రమే ఇచ్చిందని అన్నారు. గోవాలో అతి పెద్ద కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 

మెజారిటీ నిరూపించుకోవడానికి అతి పెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడం సంప్రదాయం కాదా అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఓక పార్టీని ఆహ్వానించకుండా కోర్టు అడ్డుకోగలదా అని కూడా అడిగారు. ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయదా అని ప్రశ్నించింది. 

గతంలో గవర్నర్ చర్యను అడ్డుకున్న సందర్భం ఉందని సింఘ్వీ గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన తీర్పులు గవర్నరుకు వ్యతిరేకంగా, ఆయనను అడ్డుకోవడానికి ఇచ్చిన తీర్పులు కావని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణ ప్రారంభిస్తుంది.