‘కోమటోళ్లు.. సామాజిక స్మగ్లర్లు’ అంటూ కంచె ఐలయ్య రాసిన పుస్తకానికి వ్యతిరేకంగా ఇప్పటికే ఆర్యవైశ్యులు పోరాటాలు చేస్తున్నారు. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే.. అదే ఆర్యవైశ్యులు.. మరో పోరాటానికి తప్పని పరిస్థితి కనిపిస్తోంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం   ప్రేరణ కలిపించే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు అనుబంధంగా.. కార్పొరేట్ సంస్థలకు వంత పాడేందుకు టీడీపీ ప్రభుత్వం సై అంటోంది.

అసలు విషయమేమిటంటే.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 6500 చంద్రన్న విలేజ్ మాల్స్ ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం మీడియా ముఖంగా వెల్లడించారు. వీటిని  రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ సంస్థలకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. రేషన్ డిపోలకు అనుబంధంగా ఈ విలేజ్ మాల్స్ పనిచేస్తాయని చెప్పారు. అంటే.. ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన మాల్స్ సంస్కృతిని చంద్రబాబు గ్రామాలకు కూడా పరిచయం చేస్తున్నారు.

దీనివల్ల ప్రజా ప్రయోజనం పక్కనపెడితే.. సాంప్రదాయ వ్యాపారులు నష్టాలబాట పట్టే అవకాశం ఉంది. గ్రామాల్లో దుకాణాలన్నీ దాదాపు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినవారివే ఉంటాయి. ఇప్పటికే పట్టణాల్లో వచ్చిన మాల్స్ సంస్కృతితో చాలా మంది వ్యాపారులు నష్టపోయారు. ఇప్పుడు అదే సంస్కృతి గ్రామాల్లోనూ పాకుతోంది.

ఈ విలేజ్ మాల్స్.. ఇతర దుకాణాలతో పోలిస్తే.. 20శాతం తక్కవకే వస్తువులను అందజేస్తాయని మంత్రి చెప్పారు. ఎక్కడ వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయో.. అక్కడికి వెళ్లడానికే ప్రజలు మక్కువ చూపుతారన్న విషయం తెలిసిందే. దానికి తోడు.. మాల్స్.. అద్దాల భవనాల్లో చూడగానే ఆకర్షించేలా ఉంటాయి. దీంతో.. చిన్న, మధ్యతరగతి దుకాణాల గల్లా పెట్టెలకు గండి పడుతుంది. దీంతో వారు తీవ్రంగా నష్టపోతారు. ఎప్పుడైతే చిన్న దుకాణాదారులు నష్టాలతో దుకాణాలు మూసేస్తారో..అప్పుడు ఆ మాల్స్ ధరలను అమాంతం పెంచేస్తాయి.

ఇదిలా ఉంటే రిలయన్స్ సంస్థతో చంద్రబాబుకి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఫ్యూచర్ గ్రూప్ లో హెరిటేజ్ భాగస్వామి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ రెండు సంస్థలతో తమకు ఉన్న వ్యాపార అనుబంధాన్ని కొనసాగించుకోవడం కోసం చంద్రబాబు అభివృద్ధిని అడ్డుపెట్టుకుంటున్నారనే వాదనలు వినపడుతున్నాయి.  వచ్చే ఎన్నికల్లోపు.. గ్రామాల్లోని వ్యాపారాన్నంతటినీ  చంద్రబాబు  పై రెండు సంస్థలకు కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది.