టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డేల్లో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. సెంచూరియన్ వేదికగా  టీం ఇండియా సౌత్ ఆఫ్రికా ఆరో వన్డే కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్ లోనే ధోని అరుదైన రికార్డుకు మరికొద్ది దూరంలో ఉన్నాడు.

 ఈ మ్యాచ్‌లో ధోనీ మరో 33 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్లో 10వేల పరుగులు చేసిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరుతాడు. ధోని కనుక 10వేల పరుగుల మార్క్ ని చేరుకుంటే ఆ ఘనత సాధించిన 12వ బ్యాట్స్ మెన్ గా, భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌చిన్ తెందుల్క‌ర్‌, సౌర‌భ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ భార‌త్ త‌ర‌ఫున ఈ ఘ‌న‌త సాధించిన వారిలో ఉన్నారు.

ధోనీ ఈ మైలురాయిని అందుకుంటాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు 317 వన్డేలాడిన ధోని 272 ఇన్నింగ్స్‌ ల్లో 9,967 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే  అవకాశం వస్తే.. ధోని పదివేల మార్క్ ని చేరుకునే అవకాశం ఉంది.