1969 వచ్చే నాటికి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఉధృతమైన ఉద్యమం వచ్చింది. అప్పుడు నేను 9వ తరగతిలోనే లాఠీదెబ్బలు తిన్నాను. మా నాన్న చెన్నారెడ్డికి అనుచరుడు. మా ఇంట్లో చెన్నారెడ్డి 10 రోజులున్నారు. ది హిందూ మాజీ సంపాదకుడు ఎన్ రామ్-కెసిఆర్ సమావేశంలో దొర్లిన  ఆసక్తికరమయిన విషయాలు

తెలంగాణ ఉద్యమం ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నకు ముఖ్యమంత్రి వివరణాత్మక సమాధానం ఇచ్చారు.

 ఈ రోజు ది హిందూ ఆంగ్ల ప్రతిక మాజీ సంపాదకుడు ఎన్ రామ్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలుసుకున్నారు. తాను రాసిన ‘వై స్కామ్స్ ఆర్ హియర్ టు స్టే’ పుస్తకాన్ని ముఖ్యమంత్రికి రామ్ అందించారు. ఈ సందర్భంగా సమకాలీన అంశాలతో పాటు, తెలంగాణ ఉద్యమం, కొత్త రాష్ట్రం పయనిస్తున్న తీరుపై చర్చ జరిగింది. 

ఈ సందర్బంగా వారి మధ్య అనెేక విషయాలు చర్చకు వచ్చాయి. అందులో తెలంగాణ ఉద్యమం ఒకటి. ఉద్య మానికి కారణాలను కెసిఆర్ ఇలా వివరించారు.

‘‘1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. దీనిపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. ఫజల్ అలీ కమిషన్ తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలని సిఫారసు చేసింది. అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ కూడా ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ ప్రాంతాన్ని కోరుకోవడం సామ్రాజ్య వాద విస్తరణ కాంక్ష మాత్రమే అని చెప్పారు. అయినా సరే, ఆంధ్ర వాళ్లు ఢిల్లీలో లాబీయింగ్ చేసి హైదరాబాద్ స్టేట్ ను కలుపుకున్నారు. నిజాం రాజ్యంలో ఉన్న తెలంగాణ నాయకులకు ఢిల్లీతో పరిచయాలు తక్కువ. ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ రాజ్యంలో ఉండడం వల్ల వారికి మొదటి నుంచి ఢీల్లీ వారితో సన్నిహితంగా ఉండేవారు. ఢిల్లీలో లాబీయింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. కానీ దీనిపై కేవలం తొమ్మిదేళ్లకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఆందోళన మొదలైంది. 1966లో నిరసన ప్రారంభమయింది. 1969 వచ్చే నాటికి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఉధృతమైన ఉద్యమం వచ్చింది. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను కూడా లాఠీదెబ్బలు తిన్నాను. మా నాన్న చెన్నారెడ్డికి అనుచరుడు. మా ఇంట్లో చెన్నారెడ్డి 10 రోజులున్నారు. సమైక్య పాలనలో రోజురోజుకూ వివక్ష ఎక్కువైందే తప్ప తక్కువ కాలేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన వెంటనే కొత్త రాజకీయం వచ్చింది. నేను కూడా టిడిపిలో చేరాను. దాదాపు రెండు దశాబ్దాలు ఎమ్మెల్యేగా పనిచేశాను. మంత్రిగా కూడా ఉన్నాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న నేను తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై నిత్యం పంచాయితీ పెట్టుకునే వాడిని. చివరికి 1999లో కరెంటు చార్జీలు పెంచడంతో రైతులు బాగా నష్టపోతారని చెప్పాను. అయినా వినలేదు. దీంతో నేను పదువులన్నీ వదిలి ఉద్యమం మొదలు పెట్టాను. కిరణ్ కుమార్ రెడ్డి నిండు అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని ప్రకటించారు. ఆంధ్ర పాలకుల గర్వానికి, అహంకారానికి అది నిదర్శనం. వివక్ష, నిర్లక్ష్యం అన్ని రంగాల్లో కొనసాగింది. తెలంగాణ ప్రజలు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించారు. మేము ఉద్యమ సమయంలో చెప్పినట్లే తెలంగాణ రాష్ట్రం గొప్పగా ముందుకు పోతున్నది. 21 శాతం ఆదాయ వృద్ది రేటుతో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నాం. గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. అందుకోసం మేము ప్రాజెక్టులు కడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

ఎన్. రామ్ ను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్, ఆయనను కారు దాకా వచ్చి సాగనంపారు.