టీడీపీ నేతల్లో పెరుగుతున్న భయం గ్రామస్థాయిలో టీడీపీపై పెరుగుతున్న వ్యతిరేకత పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయాలంటున్న టీడీపీ నేతలు

టీడీపీ నేతల్లో భయం మొదలైందా? క్షేత్ర స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సాధారణ ఎన్నికల సంగతి పక్కన పెడితే.. పంచాయితీ ఎన్నికల విషయంలోనూ టీడీపీ నేతలు భయపడుతున్నారు. ఏదో ఒక విధంగా వాటిని వాయిదా వేయాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.

అసలు సంగతేంటంటే.. 2019 సాధారణ ఎన్నికలు మరెంతో దూరంలో లేవన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల భవిష్యత్తు ఫలితాలు విడుదలయ్యే వరకు ఏం జరుగుంతో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలౌతాయి అన్న చందంగా రాజకీయ నేతల తలరాతలు మారిపోతుంటాయి.

అయితే.. పంచాయితీ ఎన్నికలు అలా కాదు. ఒక పంచాయితీలో సర్పంచిగా ఉన్న వ్యక్తికి తమకు మద్దతు దారులు ఎవరో, వ్యతిరేకంగా ఎవరు ఉన్నారో సులభంగా తెలిసిపోతుంది. ఎన్నికల్లో గెలుస్తామో, గెలవమో కూడా వారు గెస్ చేయగలరు. ప్రస్తుతం ఉన్న సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగియనుంది. దీంతో 2018 ఆగస్టులోపు పంచాయితీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికల తర్వాత నిర్వహిస్తే మంచిదని పలువురు సర్పంచులు అభిప్రాయపడుతున్నారని సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16000 పంచాయితీలు ఉండగా.. వాటిలో మెజారిటీ పంచాయతీలు టీడీపీ నేతలవే. కాగా.. ఇప్పటికే ప్రభుత్వంపై గ్రామాల స్థాయిలో వ్యతిరేకత మొదలైంది.ఇలాంటి సమయంలో పంచాయితీ ఎన్నికలు జరిగితే.. ఓడిపోవడం ఖాయమన్న విషయం వారికి అర్థమైంది. అందుకే పంచాయితీ ఎన్నికలు వద్దంటున్నారు.

వీటికన్నా ముందు సాధారణ ఎన్నికలు జరిగాలని వారు కోరుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ పంచాయితీలను సొంతం చేసుకోవడం పెద్ద విషయమేమీ కాదు. అలా కాకుండా పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోతే.. ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. దీంతో పంచాయితీ ఎన్నికలను వాయిదా వేయాలని అడుగుతున్నారు. దీనికి మంత్రి లోకేష్ కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్.