కుల్ భూషణ్ జాదవ్ విషయంలో పాక్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూఢచర్యం చేస్తున్నాడని ఆరోపిస్తూ.. కుల్ భూషణ్ జాదవ్ కి పాక్ అధికారులు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. కాగా.. చాలా కాలం తర్వాత జాదవ్ ని అతని తల్లి, భార్య కలుసుకునే అవకాశం కలిపించింది పాక్ ప్రభుత్వం. తాము మానవతా దృక్పథంతో జాదవ్ తన కుటుంబసభ్యులను కలిసే అవకాశం కల్పించినట్లు పాక్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ..జాదవ్ తల్లి, భార్య పట్ల కూడా పాక్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారు.

జాదవ్ తో సమావేశానికి ముందు  అతని తల్లి, భార్య  మంగళసూత్రాలు, గాజులు, బొట్టు తీయించేశారు. అంతేకాకుండా జాదవ్ భార్య బూట్లను కూడా అధికారులు తీసేసుకొని.. తిరిగి వాటిని మళ్లీ ఆమెకు ఇవ్వలేదు. ఈ విషయంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ స్పందించారు. భారత్‌ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి కొట్టిపారేశారు. అయితే..జాదవ్‌ భార్య బూట్లు తీసుకున్న మాట మాత్రం వాస్తవమేనని చెప్పారు. ఆ బూట్లలో ఏదో ఉందని.. అందుకే వాటిని తీసుకున్నట్లు తెలిపారు.

భద్రతా కారాణాల దృష్ట్యా ఆమె బూట్లను తీసుకున్నట్లు చెప్పారు. వాటికి బదులు ఆమెకు వేరే జత చెప్పులను ఇచ్చినట్లు కూడా తెలిపారు. ఆ బూట్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జాదవ్ తల్లి, భార్యల నగలను సమావేశం ముగిసిన వెంటనే తిరిగి ఇచ్చినట్లు కూడా వివరించారు.