నెల రోజులయినా టిడిపి రెండో అధినేత లోకేశ్  నంద్యాల వైపు కన్నెత్తి చూడటం లేదు ఉప ఎన్నికలపుడు పార్టీ నేతగా  ప్రచారం చేయకుండా అమరావతిలో ఎలా కూర్చుంటారు? టిడిపి తీరుచూస్తే నంద్యాలను పూర్తిగా జగన్ కు వదిలేసినట్లుంది

నంద్యాలకు అంటే నారా లోకేశ్ భయపడుతున్నాడా?

నంద్యాల ఉప ఎన్నిక ఎంత కీలమయిందో అందరికీ తెలుసు. పైకి అబ్బే కాదని ఎవరయినా బుకాయించిన అది బుకాయింపని తెలిసిపోతుంది. ఈ సీటును కైవసం చేసుకునేందుకు ప్రతిపక్షం, అధికారపక్షం చావో రేవో అనేట్లు పోరాడుతున్నాయి. రెండు పార్టీల క్యాంపెయిన్ ఎంత తీవ్రంగా ఉందో మనం చూస్తున్నాం. దాదాపు డజన్ మంది మంత్రులు,25 మంది టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపిలు నంద్యాలలోనే తిష్టవేశారు. ముఖ్యమంత్రి కనివిని ఎరుగుని రీతిలో వరాలు కుప్పించి, నంద్యాల ప్రజలను మెప్పించాలని చూస్తున్నారు. జగన్ కూడా అంతే స్థాయిలో బలసమీకరణ చేస్తున్నాడు. ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. 12 రోజులు అక్కడే ఉండి క్యాంపెయిన్ చేస్తున్నారు. జగన్ సుడిగాలిలా నంద్యాలనుచుట్టుముట్టారు. గోస్పాడుమండలం, నంద్యాల చుట్టు ఉన్న పల్లెలు, నంద్యాల పట్టణంలో రోడ్ షోలతో పాటు,ఇల్లిల్లూ తిరుగుతున్నాడు. లిఫ్ట్ లేని అపార్ట్ మెంటుల్లోని రెండు అంతస్తు,మూడో అంతస్తుకు ఎక్కిపోయి ఓటడుగుతున్నారు. ఒక పార్టీ నాయకుడు ఒక ఉప ఎన్నికకోసం ఇంతగా కష్టపడటం జరగదు. దీనికి కారణం ఉంది. ఎందుకంటే, ఈ ఎన్నిక టిడిపి పాలన మూడేళ్ల తర్వాత వచ్చిది. ఒక ఫిరాయింపుదారు నియోజకవర్గంలో వచ్చింది. అంతేకాదు, మూడేళ్లలో ముఖ్యమంత్రి రాయలసీమకు ఏమి చేశాడో పరీక్షకు పెట్టేందుకు అనుకూలంగా ఉంది. మరొక విధంగా చంద్రబాబు ప్రభుత్వ తీరు, అతని అమరావతి కేందంగా సాగుతున్న పాలన... ఇవన్నీ ఇక్కడ చర్చకువస్తున్నాయి. అందువల్ల రేపటి తీర్పును చంద్రబాబు ప్రభుత్వమీద తీర్పుగా భావించే అవకాశం ఉంది.టిడిపి ఓడిపోతే, చంద్రబాబాబు ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారనవచ్చు. వైసిపి ఓడిపోతే, జగన్ దూకుడు, జగన్ రాజకీయాలు నడుపుతున్నతీరును ప్రజలు తిరస్కరించారని విశ్లేషించవచ్చు.

ఇలాంటి కీలకమయిన ఎన్నిక జరగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ నెలరోజులుగా ఫీల్డ్ ను మొత్తం జగన్ కు వదిలేసింది. టిడిపి అధ్యక్షుడిని ప్రచారానికి రోజూ రాలేకపోయినా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్ కూడా నంద్యాల వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. ఆయన జూలై 14 న నంద్యాల, కర్నూలులలో పర్యటించారు. అంతే, మళ్లీపత్తాలేదు. నిజానికి ఈ క్యాంపెయిన్ కు నారా లోకేశ్ నాయకత్వం వహిస్తారని, ఆయన ఈ ఎన్నికల్లో టిడిపికి విజయం సాధించి, కాబోయే ముఖ్యమంత్రిగా అర్హత సంపాదిస్తారని అనుకున్నారు. అయితే, ఆశ్చర్యం, నారాలోకేశ్ నెల రోజులుయినా నంద్యాల వైపు రావడం లేదు. హైదరాబాద్ జిహెచ్ ఎంసి ఎన్నికల్లో ఆయన ఎలా క్యాంపెయిన్ చేశాడో అంతా చూశారు. ఇపుడు అలాగే చేయాలి. పార్టీ రెండో అధినేతగా ఆయన నంద్యాలలోనే కూర్చుని ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకు వస్తూ ఉండాలి. కాని లోకేశ్ రావడం లేదు. ముఖ్యమంత్రి రావడం లేదు. తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు గెస్టు హౌస్, లాడ్జింగ్ లలో, ప్రెస్ కాన్ఫరెన్స్ లకు పరిమితమయ్యారు. నంద్యాలలో వీరు చేస్తున్నదేమీ లేదు. ఫలితంగా ఫీల్డ్ లో ఒక్కరే కనిపిస్తున్నారు. ఆ ఒక్కరు జగనే. కీలకమయిన ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నంద్యాలను జగన్ కు వదిలేశారా అనిపిస్తుంది.

ఎందుకిలా జరిగింది?

నారా లోకేశ్ కర్నూలు జిల్లాలో జూలై13,14 తేదీలలో పర్యటించారు. ఆయన ప్రసంగాలు ఆకట్టుకోలేదు. అయిదు లక్షల ఉద్యోగాలిచ్చామని ఆయన అనడంతో అక్కడి జనవిజ్ఞాన వేదిక వారు నిలదీసి అది తప్పని, ఇవ్వలేదని, ఇస్తామని ఆయనతో చెప్పించారు. నంద్యాల ఎస్ హెచ్ జి మహిళలు కూడా నిలదీశారు. దీని మీద ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు సోషల్ మీడియా కూడా లోకే శ్ మీద జోకుల వర్షం కురిపించింది. ఇది టిడిపిని బాగా ఇరుకున పెట్టింది. లోకేశ్ ఎపుడు నోరు జారతాడా, డంబాలు పలుకుతాడా అని దాడి చేసి రక్కేందుకు వైసిపి నేతలంతా ఎదురుచూస్తున్నారు.

అందువల్ల నంద్యాలలో లోకేశ్ పర్యటించకపోవడమే మంచిదని ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చారని టిడిపి వర్గల్లో వినపడుతూ ఉంది. ఈ కారణానే, అమరావతికి పట్టమని 300 కిమీ దూరంలో కూడా లేదని నంద్యాలకు రాకుండా లోకేశ్ ముఖం చాటేశాడని నంద్యాలలో వినిపిస్తా ఉంది. ఇదెంతవరకు నిజమో కాని, నెల రోజులయినా లోకేశ్ నంద్యాల వైపురాకపోవడానికి సరైన కారణం కనిపించదు.

ముఖ్యమంత్రి రెగ్యులర్ గా రాక, నారా లోకేశ్ రాక, కేవలం ఇతర జిల్లాలకు చెందిన మంత్రులను నంద్యాలలో కూర్చోబెట్టి నెగ్గడమెలా అనేది ఇక్కడి టిడిపి వారిని వేధిస్తున్న ప్రశ్న. అందుకే కనీసం ఒక రౌండు బాలకృష్ణనయినా పంపండి వారు వేడుకుంటున్నారు. దీనికి స్పందన లేదని వారు ఆవేదన చెందుతున్నారు.