రాంగోపాల్ వర్మ పచ్చిగా చెప్తాడు కాబట్టి మనకు నచ్చదు కానీ (నచ్చక పోవడానికి కారణం ఇబ్బంది)... 'గన్స్ అండ్ థైస్' అన్నిచోట్లా ఉన్నదే. మాఫియాలో కంటే ఇది రాజకీయ, పోలీసు వ్యవస్థలో ఎక్కువ. దీనికి తోడు 'మనీ, పవర్' కూడా కలిసింది. ప్రభాకర్ రెడ్డి - శిరీషల ఆత్మహత్యకు పైని కోణాలు యెంత లోతుల్లో ఉన్నాయో, నిష్పాక్షిక దర్యాప్తులోనే తేలుతుంది కానీ, అలా జరిగే అవకాశం లేదు. అది పోలీసులకు, రాజకీయ నాయకులకు ప్రమాదం కాబట్టి. 

 

ఈ మానవ ప్రవృత్తి అంశాన్ని రాంగోపాల్ వర్మకూ, రాజకీయ తీర్పులను 2019 ఓటర్లకూ వదిలేసి, కొంచెం క్షేత్రస్థాయి వివరాల్లోకి పోదాం! 

*

దేశంలోనే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అనీ, రాష్ట్రం మొత్తంలోనే సిద్ధిపేట కమీషనరేట్ (సీఎం, హరీష్ ల జిల్లా కాబట్టి) ఆదర్శవంతమైనదనీ, అసలు కేసీఆర్ పాలనే (?) భూగ్రహంతో పాటు సౌరకుటుంబంలోని, ఆ మాటకొస్తే పాలపుంతలోనే గమ్మత్తు అని అందరూ అంటున్నారు అని కదా ఆ కుటుంబం, వారికంటే మించి  మీడియా ఎప్పుడూ రాసేది?  వారిని దాటిపోయి మౌన మేధావులు, పీఆర్వోలూ, సీపీఆర్వోలూ రాసేది?

 

ఎవరైనా ఈ ప్రశ్నలకు బదులు ఇస్తారా?

 

1.  స్వ రాష్ట్రం వచ్చాక ఇప్పటికి 8 మంది ఎస్సైలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? ఆ కేసుల దర్యాప్తులు ఎమైతున్నయి? 

2. 'ఆదర్శ' సిద్ధిపేట కమీషనరేట్ లో ముగ్గురు ఎస్సైలు (రామకృష్ణా రెడ్డి, చిట్టిబాబు, ప్రభాకర్ రెడ్డి) ఆత్మహత్యలు చేసుకునేంత వత్తిడి ఉందని అందరికీ తెలుసు. ఆర్.కె.  రెడ్డి ఆరునెలల క్రితంసూసైడ్ నోట్లో అదే రాసారు. ప్రభాకర్ రెడ్డి కూడా ఈ 'మామూలు ఒత్తిడి, వేధింపుల' విషయం సీఎంకు రాస్తూ సీక్రెట్ బాక్స్ లో వేసారు పోలీసుల సదస్సులో అంటున్నారు.  పోయిన డిసెంబర్ లో జరిగిన ఆర్.కె ఆత్మహత్య విషయంలో డీఎస్పీ శ్రీధర్ ను హెడ్డాఫీసుకు అటాచ్ చేయడం తప్పించి ఒక్క అడుగైనా ముందుకు వేయనిచ్చిందా పోలీసులను ప్రభుత్వం? 

3. రాజీవ్ రహదారిపై మామూళ్ళ కాసుల వర్షం కురిపించే ఇసుక మాఫియాలో : 

3.1: పై అధికారుల అనుమతి లేనిదే ఎస్సైలపై మామూళ్ళ కోసం వత్తిడి పెంచుతారా?  

3.2:  హరీష్ రావు (నాయిని కాదు!) కు వాటా యివ్వకుండా, పోలీసులు ఇన్ని అన్యాయాల నుంచి తప్పించుకోగలుగుతారా? 

కాబట్టి... అధికార పార్టీ, 'అనధికార' మీడియా, ఆస్థాన భజన బృందాలు ఇందులోని 'మనీ అండ్ గన్స్' అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకే 'గన్స్ అండ్ థైస్' అంశాన్ని ముందుకు తెస్తున్నారు. 

మరో కోణంలో : వైరుధ్యాల లోంచే నిజాలు తన్నుకు వస్తాయి అన్నది నిజం చేస్తూ, తమ తప్పులేదని, శిరీష ఆత్మహత్యే ఎస్సై ఆత్మహత్యకు ప్రేరణ అని నిరూపించేందుకు నానా తంటాలు పడుతున్న పోలీసులు, (ముఖ్య)మంత్రులూ... అందుకోసమైనా శిరీష అంశాన్ని తిరగతోడి, స్పీడప్ చేసి, అతి సీరియస్ గా, సశాస్త్రీయంగా, నిజాయితీగా ఆమె కేసులో విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. ఇందులో పోలీసుల తాత్కాలిక ప్రయోజనాలు ఉంటే ఉండవచ్చు కానీ, శిరీష విషయంలో దాగిన నిజాలు బయటకు రావడం అవసరం.  రాజకీయ అధికార-విపక్ష క్రీడలో ఆడపిల్లను పావుగా వాడుకోవడం, ఆమెకు చనిపోయిన తర్వాతా అన్యాయం జరగడం దారుణాతి దారుణం.  అదే సమయంలో, ఒక నేరాన్ని ప్రూవ్ చేయడానికో, దాచేయడానికో మరో నేరాన్ని కప్పిపుచ్చడం అమానవీయం. 

 

ఇపుడు శిక్షలు పడాల్సింది : పవర్ కు. అది పోలీసు అధికారులకైనా, ఇన్వాల్వ్ అయిన అధికార పార్టీకి అయినా, సెక్స్ కు ముగింపు 'ఆత్మ'హత్యల్లో పలికే పురుషజాతికి అయినా ! 

 

(రచయిత, ప్రజా తెలంగాణా కన్వీనర్. హైదరాబాద్. ఈ వ్యాసంలో వెలిబుచ్చిన అంశాలు ఆయన వ్యక్తి గత అభిప్రాయాలు)