బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతాన్ని ప్రస్తావించారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడారు. 

దళితుల సమస్యసలను ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదని, రోహిత్ వేముల మరణించినప్పుడు ప్రధాని నోరు కూడా మెదపలేదని అన్నారు. ప్రధాని అభ్యర్థి విషయంపై తాను మాట్లాడదలుచుకోలేదని అన్నారు. 

సోనియా గాంధీ ఇటాలియన్ జాతికి చెందినవారని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యపై ఆయన స్పందించారు. చాలా చాలా మంది భారతీయుల కన్నా తన తల్లి ఎక్కువ భారతీయురాలని అన్నారు. 

తన తల్లి ఇటాలియన్ అని, తన జీవితంలో ఎక్కువ కాలం భారతదేశంలో ఉన్నారని, ఈ దేశం కోసం త్యాగాలు చేశారని, ఈ దేశం కోసం బాధను అనుభవించారని అన్నారు. 

ప్రధాని మోదీకి లోపల ఆగ్రహం ఉందని, అందరి మీదా కోపం ఉందని, లోపల ఆయనను భయం ఆవహించిందని, దానివల్ల తనపై కోపంగా ఉన్నారని, ఆ కోపం తనను ఆకర్షిస్తోందని, ఆ కోపం ఆయన శత్రువని, తన శత్రువు కాదని అన్నారు. 

కర్ణాటక ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని, ఇది రెండు సిద్దాంతాల మధ్య పోరాటమని చెప్పారు. ఈ ఎన్నికలకు తనకు గానీ ప్రధానికి గానీ సంబంధించినవి కావని, కర్ణాటక ప్రజలకు సంబంధించినవని అన్నారు.