ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వాట్సాప్ లో గ్రూప్స్ క్రియేట్ చేసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి గ్రూప్ కి ఒకరో, ఇద్దరో అడ్మిన్లు కూడా ఉంటారు. అయితే.. మీరు సభ్యుడిగా ఉన్న గ్రూప్ కి మీకు నచ్చని వ్యక్తి అడ్మిన్ గా ఉంటే.. వారిని అడ్మిన్ హోదా నుంచి తొలగించవచ్చు. ఈ ఫీచర్ ని వాట్సాప్ త్వరలో మన ముందుకు తీసుకురానుంది.

వివరాల్లోకి వెళితే.. వాట్సాప్ ‘‘ డిస్మిస్ యాస్ అడ్మిన్’’ అనే ఫీచర్ ని ప్రవేశపెడుతోంది. దీని వల్ల గ్రూప్‌లో అడ్మిన్‌గా ఉండే వ్యక్తిని పూర్తిగా గ్రూప్ నుంచి తొలగించాల్సిన అవసరం లేదు. కేవలం అడ్మిన్‌గా మాత్రమే తొలగించవచ్చు. దీంతో అడ్మిన్‌గా తొలగించిన తర్వాత ఆ వ్యక్తి  ఆ గ్రూప్‌లో సభ్యుడిగా మాత్రమే ఉంటాడు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ అంతర్గతంగా పరిశీలిస్తున్నది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఈ ఫీచర్ లభ్యం కానుంది. అయితే ఏదైనా గ్రూప్‌కు చెందిన ఒక అడ్మిన్‌ను తొలగించాలంటే ముందుగా మరొకరు అడ్మిన్ కావల్సి ఉంటుంది.

అలా అడ్మిన్ అయ్యాకే మరో అడ్మిన్‌ను తొలగించవచ్చు. ఇందుకు గాను గ్రూప్ అడ్మిన్ కింద డిస్మిస్ బటన్‌ను వాట్సాప్ ఏర్పాటు చేయనుంది. దీంతో ఒక అడ్మిన్ మరో అడ్మిన్‌ను వాట్సాప్ గ్రూప్‌నకు అడ్మిన్‌గా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాట్సాప్‌లో త్వరలో గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని కంట్రోల్స్ ఇవ్వనున్నారు. గ్రూప్‌లోని సభ్యులెవరైనా అభ్యంతరకరంగా టెక్ట్స్ సందేశాలు, ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లు, డాక్యుమెంట్స్ పంపితే వారిని నియంత్రించే అధికారాన్ని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఇవ్వనున్నారు. అతి త్వరలో ఈ ఫీచర్లు వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.