ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో రెండు సరికొత్త ఫీచర్లను విడుదల చేసింది. ఇటీవలే వాట్సాప్ లో పేమెంట్స్ ఫీచర్ ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మరో రెండు అదిరిపోయే ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు వాట్సాప్ నుంచి  వాయిస్ కాల్స్ , వీడియో కాల్స్  చేసుకునే ఉంటారు. కానీ.. వీడియో కాల్ నుంచి వాయిస్ కాల్స్ లోకి మారడం మాత్రం వీలు కుదిరేది కాదు. కొద్ది రోజుల క్రితం ఈ ఫీచర్ ని ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇప్పుడు ఈ ఫీచర్ నే అమలులోకి తీసుకువచ్చింది.

కాల్‌ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్‌పై స్విచ్‌ ఆప్షన్‌ కన్పిస్తుంది.  దాన్ని క్లిక్‌ చేయగానే అవతలివారికి మీరు వాయిస్‌ కాల్‌ నుంచి వీడియో కాల్‌కు మారాలనుకుంటున్నట్లుగా నోటిఫికేషన్‌ వెళ్తుంది. దాన్ని అవతలివారు అంగీకరించగానే వాయిస్‌ కాల్‌ నుంచి వీడియోకాల్‌కు మారిపోతారు. దీంతో పాటు గ్రూప్‌లో పోస్టు చేసిన మెసేజెస్‌లో రీడ్‌ చేయని వాటిని ‘@ ’ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. అంతేకాదు గ్రూప్‌లోని మరొకరిని మెన్షన్‌ చేస్తూ మెసేజ్‌ చేయచ్చు. అయితే ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ కేవలం ఐఓఎస్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్స్‌ ను ఉపయోగించుకునేందుకు లేటెస్ట్‌ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.