వాట్సాప్ లో పెద్ద లోపం కనిపెట్టిన జర్మనీ పరిశోధకులు మెసేజ్ ప్రైవసీకి భంగం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో గ్రూప్ చాట్స్ చేస్తున్నారా..? అయితే.. మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఎందుకంటే.. గ్రూప్ లోని లేని వ్యక్తులు కూడా అడ్మిన్ అనుమతి లేకుండా ఈజీగా మీ చాట్స్‌లోకి దూరే ప్రమాదం ఉంది. జర్మనీకి చెందిన కొందరు పరిశోధకులు వాట్సాప్‌లోని ఈ కీలక లోపాన్ని కనిపెట్టారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో జరుగుతున్న రియల్ వరల్డ్ క్రిప్టో సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. యాప్ సర్వర్లను నియంత్రించే వ్యక్తులు అడ్మిన్ అనుమతి లేకుండానే ఎవరి గ్రూప్ లోకైనా ప్రవేశించే అవకాశం ఉందని.. గ్రూప్ చాట్స్ చదివే అవకాశం ఉందని వారు తెలిపారు. ఓ బగ్‌ను ఆసరాగా చేసుకొని వీళ్లు ఈజీగా గ్రూప్స్ లో చొరబడుతున్నారని చెప్పారు. నిజానికి గ్రూప్ అడ్మిన్ మాత్రమే కొత్త వ్యక్తులను గ్రూప్‌లోకి చేర్చడానికి వీలు ఉంటుంది. కానీ సర్వర్‌లో ఉన్న లోపం కారణంగా దానిని నియంత్రించే వ్యక్తులు ఎవరినైనా ఏదైనా గ్రూప్‌లోనికి ఈజీగా చేర్చేసే చాన్స్ ఉంటుంది. దీనివల్ల గ్రూపులో జరిగే ప్రైవేట్ చాట్స్ అన్నింటినీ అందులో చొరబడిన బయటి వ్యక్తులు చూసుకునే వీలుంటుంది.
నిజానికి రెండేళ్ల కిందటే మూడో వ్యక్తి చొరబడేందుకు వీల్లేకుండా ప్రతి కన్వర్జేషన్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను యాడ్ చేసింది వాట్సాప్. అయినా తాజాగా గ్రూప్ చాట్స్ లోకి బయటి వ్యక్తి రావచ్చన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఆ అవకాశమే లేదంటున్నది వాట్సాప్. ఈ తాజా బగ్‌పై సంస్థ ప్రతినిధి స్పందిస్తూ.. ఏ కొత్త వ్యక్తీ రహస్యంగా గ్రూప్‌లోకి వచ్చే అవకాశం లేదని, ఒకవేళ అలా రావడానికి ప్రయత్నిస్తే వెంటనే నోటిఫికేషన్ వెళ్తుందని చెప్పారు. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని స్పష్టంచేశారు.
