ఉమెన్స్ హాస్టల్ లో జాగ్రత్తలు చేపట్టాలని పోలీసులు ఎన్ని సూచనలు చేస్తున్నా ఏదో విధంగా మహిళలపై వేదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. హాస్టల్ నిర్వహకులు, వర్కర్లు కూడా మహిళలను వేధిస్తున్న సంఘటనలు గుట్టుగా జరుగుతున్నాయి.ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు వారి ఉదంతాలు బయటకు రావడం లేదు. దీంతో వారు  రెచ్చిపోతున్నారు. ఇలా ఓ హాస్టల్ నిర్వహకుడి తనయుడు హాస్టల్ లోని ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి పట్టుబడిన సంఘటన కెపీహెచ్ కేపీహెచ్‌బీ కాలనీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే  కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెంబర్ 5 లో ఓ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌ ను నిర్వహిస్తున్నారు. ఇది హైటెక్ సిటీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో చాలా మంది సాఫ్ట్ వేర్ యువత ఇందులో ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఓ మహిళ స్నానం చేస్తుండగా బైట నుంచి ఎవరో ఫోన్ లో ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు గుర్తించింది. దీంతో ఆమె అప్రమత్తమై బైటకు వచ్చి చిత్రీకరిస్తున్న హాస్టల్ నిర్వహకుడి కొడుకుని  రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది.  ఈ విషయంపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కేవలం ఈ ఒక్క మహిళ చిత్రాలనే చిత్రీకరించాడా లేదా ఇతర మహిళల చిత్రాలను కూడా చిత్రీకరిస్తున్నాడా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.  

అయితే ఎన్ని సీసీ కెమెరాలు, భద్రతా చర్యలు చేపట్టినా ఇలాంటి దుర్ఘటనలు జరగడంతో ఉమెన్స్ హాస్టళ్లలో ఉండటానికి మహిళలు జంకుతున్నారు.