అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే తమ్ముడు  ప్రభాకర్ రెడ్డి నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్ దక్షిణాది లోనే ఒక పెద్ద బస్సుల సంస్థ.  రాజకీయాలలో బ్రదర్స్ బాగా ఫాస్టు, అయితే, రోడ్ల మీద వారి బస్సులు అంతకంటే ఫాస్టు. వారి బస్సులకు  అడ్డుండదు.  తెలంగాణా, కావచ్చు, అంధ్ర కావచ్చు, బస్సుల నడపడానికి  ఏదయిన ప్రాబ్లమ్ ఎదురయితే ఏకంగా ప్రభాకర్ రెడ్డి ట్రాన్స్ పోర్టాఫీసుకు వచ్చి సవాల్ విసురుతాడు. ఇది ఉమ్మడి ఆంధ్రలో జరిగింది, తెలంగాణాకు కూడా అనుభవం లోకి వచ్చింది. ప్రభాకర్ రెడ్డి ఒక్కడే వస్తాడు, ఛాలెంజ్ అంటాడు.

 

ఇలాగే వాళ్ల బస్సులు కూడా రోడ్ల మీద ఛాలెంజ్ విసురుతుంటాయి. వాళ్ల  డ్రయివర్లు తాగి తూలాతారా, నిద్రలో తూలారా అనేది ఎప్పటికి బయటపడని బహ్మ రహస్యం. అందుకే వారి బస్సుల యాక్సిడెంట్లలో విచారణలో ఏమి తేలిందో చెప్పడం కష్టం.

 

మంగళవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద 11 మంది మృతికి కారణమయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం  ఈ కంపెనీకి  రెండో ఘోర ప్రమాదం.

 

మొదటి ప్రమాదం 2013 అక్టోబరు 30న మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాలెం వద్ద ఓల్వో బస్సుకు జరిగింది. ఈ ప్రమాదం భారత బస్సు ప్రమాదాలలోనే ఒక ఘోరమయిన దుర్ఘటననిలిచిపోయింది. ఈ  ప్రమాదంలో లేచిన  మంటలకు 45 మంది మాడిపోయారు. బస్సు దివాకర్‌ ట్రావెల్స్‌ శాఖ జబ్బార్‌ ట్రావెల్స్‌ ది. ఈ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలు న్యాయం కోసం పడిన నరక యాతన కథలు ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి.

ఈ ప్రమాదం జరిగిన ఏడాది తర్వాత కూడా కొన్ని మృతుల కుటుంబాలకు పరిహారం దొరకలేదు. 35 కుటుంబాలకు కేవలం లక్ష రుపాయల పరిహారం లభించిందని మీడియా సమాచారం. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మృతుల కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగం హామీ ఇచ్చారు. ఈ లోపు తెలంగాణా వచ్చింది. కిరణ్ వెళ్లిపోయాడు, హామీ మాత్రం గాలిలో తిరుగుతూ ఉంది. దివాకర్ బ్రదర్స్ అపుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఇపుడు తెలుగుదేశంలో ఉన్నారు. ఇదొక్కటే మార్పు.

 

 ఈ గాయం మానక ముందే దివాకర్‌ ట్రావెల్స్‌  ఇపుడు మరొక ప్రమాదానికి కారణమయింది.బాధితులకు యాజమాన్యం నుంచి పరిహారం ఇప్పిస్తామని  చెప్పకుండా ముఖ్యమంత్రి  చంద్రబాబు చంద్రన్నబీమా నుంచి పరిహారం ప్రకటించారు. యాజమాన్యం కుటుంబం అనంతపురం రాజకీయాలలో బాబుకు  చాలా అవసరం కాబట్టి, వారి భారం తానే మోద్దామని, జనం మీదకు తోద్దాం అని అనుకుంటున్నారా?

 

ప్రయాణికుల  భద్రతకు యాజమాన్యం తీసుకుంటున్న చర్యలేమీ లేవని  బాగా  విమర్శలువస్తున్నాయి. ఈ విషయాల జోలికి ప్రభుత్వాలు వెల్లడం లేదు.

 

ఒక్క తెలంగాణాలోనే దివాకర్‌ ట్రావెల్స్‌కు సంబంధించి 250 బస్సులు నడుస్తున్నాయని తెలంగాణ అసెంబ్లీలో  టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ వ్యాఖ్యనించడం అనంతరం గొడవ సంగతి తెలిసిందే.

 

ఈ బస్సుల్లో నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారన్న అంశాన్ని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ ఎత్తిచూపారు. కాంట్రాక్టు క్యారేజీల పేరుతో పర్మిట్లు పొంది... స్టేజీ క్యారేజీలు నడుపుతున్నట్లు ఆయన ఆరోపించారు. ఇది తెలంగాణా ప్రభుత్వానికి, రవాణా అధికారులకు తెలియనంత గోప్యమయిన విషయమా?

 

మంగళవారం ప్రమాదానికి గురైన బస్సు కాంట్రాక్టు క్యారేజీ కింద హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌కు అనుమతులు పొందింది. కానీ మధ్యలో విజయవాడ, విశాఖ ప్రాంతంలో పలుచోట్ల ప్రయాణికులను ఎక్కించుకున్నారని చెబుతున్నారు. ఇది నిబంధనలను అతిక్రమించడమని ఎపి ముఖ్యమంత్రికి, అధికారులకు తలియదా?

 

 ప్రయాణికులతో పాటు  ఈ బస్సుల్లో పార్సిళ్లు కూడా పెద్ద ఎత్తున మోసుకెళ్తున్న విషయం ప్రభుత్వాలకు తెలియదా?

 

2013  పాలెం ప్రమాదం తర్వాత ఈ లొసుగులు చర్చకు వచ్చినా, అవే లొసులుగు భద్రంగా కొనసాగుతూనే ఉన్నాయని ముళ్లపాడు ప్రమాదం  ఎత్తి చూపింది.

 

వారికి అధికారపార్టీ (ల) అండదండలు దండిగా ఉన్నయనేందుకు ఇంతకంటే సాక్ష్యం అవసరమా.

 

శ్రీనివాస్ గౌడ్ ఆవేశంగా   ఏదో మాట్లాడి ఉండవచ్చు, అటు తెలంగాణ లో  ఇటు ఆంధ్రప్రదేశ్‌ లోనూ వారికి ఉన్న రాజకీయ పలుకుబడి ముందు, పాపం, శ్రీనివాస్ గౌడ్ చాలా అల్ప ప్రాణి. రవాణా శాఖ ఉద్యోగుల తో  పాటు ఈ శాఖను చూసే రాజకీయ నాయకుల ఆస్తులలో ట్రావెల్స్ వారి వాటా ఎంత వుందో తెలుతుందా?

 

ఈ అనుబంధం కొనసాగుతున్నంతవరకు   ట్రావెల్స్ బస్సుల యమ ఫాస్టుగా ప్రమాదాలు చేస్తూనే ఉంటాయి.