ఒకరు కాకలుతీరిన రాజకీయనాయకుడు, ముఖ్యమంత్రి; మరొకరు బాగా మార్కెట్ ఉన్న సినీనటుడు, మెగాస్టార్. వీళ్లిద్దరి మధ్య పోలిక కనిపించదు.  రాజకీయాల్లో ప్రవేశించినా, చిరంజీవి విజయవంతంకాలేక పోయారు. అక్కడ  ప్రజానాయకుడిగా ఎదగలేకపోయారు. మెగాస్టార్ ఇమేజ్ తోనే ఆయన  రాజకీయాలాడాల్సి వచ్చింది. ఎన్టీఆర్  లాగా సినిమా ఇమేజ్ ని పొలిటికల్ ఇమేజ్ గా చిరంజీవి మార్చుకోలేకపోయారు. అందుకే ప్రజారాజ్యం మూసేసి, కాంగ్రెస్ లో చేరినా ఆయన సులభంగా మళ్లీ సినిమాల్లోకి వెళ్లి ఖైదీ నెంబర్ 150 తీసి బాక్సాఫీస్ దగ్గిర వీరంగం సృష్టించారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా  సాధించిందేమీ లేదు.

అలా కాకుండా చంద్రబాబు నాయుడు చాలా సక్సెస్ ఫుల్ పొలిటిషియన్. ఆయనకంటూ ఏ ఇమేజ్ లేదు. మాట తీరు బాగుండదు. ఉపన్యాసాలు చప్పగా ఉంటాయి. ఎలాంటి హావభావాలు ముఖంలో ఉండవు. నవ్వడం  అరుదు.అయినా సరే, తాను పదవీచ్యుతుడిని చేసిన   ఎన్టీఆర్ బొమ్మనే  పెట్టుకుని ఎన్నికల్లో గెలుస్తున్నారు.  అంత్యంత క్లిష్టసమయం 2014లో  ఎన్నిగెల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనవాడిన బొమ్మ ఎన్టీ ఆర్ ఒక్కరే.

దీనికి భిన్నంగా మెగాస్టార్. ఫూలె,అంబేద్కర్, మదర్ ధెరీసా బొమ్మలు పెట్టి, సాంఘిక న్యాయం కావాలంటూ 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 1998 ఎన్నికల్లో ఆయనకు 18 సీట్లు వచ్చాయి.  అయితే, 18 సీట్లతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్రంలో మంత్రి అయ్యారు. రాష్ట్రంలో రెండు మంత్రిపదవులు సంపాదించారు. బాగా బేరమాడినట్లే లెక్క.

మరి, చంద్రబాబుకి,  చిరంజీవికి ఉన్న సామ్యమేమిటి?

ఇద్దరు ఒక లాగే తమ పార్టీని ముంచేస్తున్నారు. కాకపోతే, చిరంజీవి ఆంధ్రాలో చేశారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో చేస్తున్నారు.

ఎలా?

18 సీట్లు గెల్చుకున్న  ప్రజారాజ్యం పార్టీని  ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా కాంగ్రెస్ లో  ఎందుకు కలపాల్సి వచ్చిందని నాటి ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర వహించి, ఆయనకు సన్నిహితంగా ఉండటమే కాదు, సలహాదారుగా పనిచేసిన ఒక నాయకుడిని ప్రశ్నించాం. దానికి ఆయన చెప్పిన సమాధానం ఇది.

‘ చిరంజీవి సకాలం లో సరైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తాను  కేంద్ర మంత్రయ్యారు. ఇక్కడ ఇద్దరికి మంత్రి పదవులిప్పించారు. కేంద్రమంత్రి గా ఉంటూ   రాజకీయ పవరేమిటో చూశారు. అలా కాకుండా, ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చుని ఉంటే ఏమయ్యేది? ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లోకి వెళ్లేవారు. అది అప్పటికే మొదలయింది. ఆయన ఎవ్వరినీ ఆపే స్థితిలో లేరు. ఆయన  మాటను ఏ ఎమ్మెల్యే  కూడా వినేస్థితిలో లేరు. అందుకే  పార్టీ ని విలీనం చేయడం సరైంది. ప్రజారాజ్యం చాప్టర్ గౌరవంగా ముగిసింది. ఆయన కేంద్రమంత్రి గా ఎంజాయ్ చేశారు. లేకుంటే చాలా అవమానకరంగా పొలిటికల్ కెరీర్  ముగిసేది,’ అని అన్నారు.

ఇపుడు చంద్రబాబు కూడా  టిఆర్ ఎస్, టిడిపి కలవాలనుకోవడం ఒక విధంగా సరైన నిర్ణయం అంటారాయన.  ఎందుకంటే ఈ పార్టీ 2019లతో ఉనికిలో  లేకుండా పోతుంది. అపుడు చంద్రబాబుకు మిగిలేదేముంటుంది? ఇపుడయితే, ఏవో కొంత బిసి వోట్ బ్యాంకు ఉందని జనంలో, రాజకీయవర్గాల్లో భ్రమ ఉంది. ఆ వోట్ బ్యాంకు ట్రాన్స్ ఫర్ అవుతుందనే ఆశ కెసిఆర్ లో కూడా ఉన్నట్లుంది. అందువల్ల  చంద్రబాబు తో చేతులు కలపడానికి రెడీ అవుతున్నారు. మోత్కుపల్లి నరసింహులు కూడా ఇపుడు టిఆర్ ఎస్ జిందాబాద్ అంటున్నారు. ఈ సమయంలో టిఆర్ ఎస్ తో కలసిపోవడమంటే  గౌరవంగా బయటపడటమే. 2019లో టిఆర్ ఎస్ పొత్తుతో గెలిస్తే, మంత్రి వర్గంలో రెండుమూడు సీట్లు రావచ్చు. తెలుగుదేశం కాంట్రాక్టర్లు తెలంగాణ లో బిజినెస్ చేసుకోవచ్చు. ఉన్న ఆస్తులను రక్షించుకోవచ్చు , పెంచుకోవచ్చు. లేదంటే,  టిడిపి చరిత్ర అవమానకరంగా ముగుస్తుంది తెలంగాణలో. పార్టీలో ఎవరూ మిగలరు. మిగిలినోళ్లు ఎన్నికల్లో గెలవరు.

ఇదే చంద్రబాబు చిరంజీవి మధ్య ఉన్న పోలిక అని ఆ నాయకుడు చెప్పారు.

తెలంగాణ టిడిపి రెబెల్ రేవంత్ రెడ్డి  ఒక విధంగా , మోత్కుపల్లి మరొక విధంగా  టిఆర్ ఎస్ మీద రెచ్చిపోవడంలో ఉన్న రహస్యమంతా 2019 ముప్పు నుంచి  గౌరవంగా ఎలా బయటపడాలనే.