ఏమాత్రం అవకాశం దొరికినా లేకపోతే దొరికిచ్చుకుని మరీ ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు వేస్తున్నాయి.
రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకూ ఇద్దరు ఎంఎల్ఏలు కంట్లో నలుసుల్లా తయారయ్యారు. వారే తెలంగాణాలో రేవంత్ రెడ్డి, ఏపిలో రోజా. విచిత్రమేమిటంటే ఇద్దరూ ఎంఎల్ఏగా గెలవటం ఇదే తొలిసారి. ఇద్దరూ తమ వాగ్దాటితో అధికార పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అందుకే అధికారపార్టీలు ఈ ఇద్దరి ఎంఎల్ఏలను అసెంబ్లీలో చూడాలనుకోవటం లేదు. కాబట్టే ఏమాత్రం అవకాశం దొరికినా లేకపోతే దొరికిచ్చుకుని మరీ ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు వేస్తున్నాయి. ఇద్దరి ఎంఎల్ఏల్లోనూ తెలంగాణాలో రేవంత్ పరిస్ధితి కాస్త నయం.
తెలంగాణాలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేవంత్ పై మొత్తం సెషన్ వరకూ అధికార టిఆర్ఎస్ సస్పెండ్ చేసింది. సస్పెన్ష కు ప్రభుత్వం చెబుతున్నకారణాలు విచిత్రంగా ఉంది. గవర్నర్ ప్రసంగం జరుగుతున్నపుడు నిబంధనలకు విరుద్ధంగా టిడిపి సభ్యులిద్దరూ వాకౌట్ చేసారట. సభలో గవర్నర్ ఉన్నపుడు వాకౌట్ చేయకూడదని ఎక్కడా లేదు. ఒకవేళ అదే నిజమనుకుంటే, గతంలో గవర్నర్ పైనే దాడికి ప్రయత్నించిన హరీష్ రావు తదితరులపై ఎటువంటి చర్యలు తసుకుని వుండాలో? మొత్తానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏదో కారణంతో ప్రభుత్వం రేవంత్ రెడ్డిని పదేపదే సస్పెండ్ చేస్తూనే ఉంది.
ఇక, ఏపి విషయం తీసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం కూడా రోజా విషయంలో అదే విధంగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా రోజా ఉనికిని సైతం టిడిపి సహించలేకుంది. అందుకనే రోజాను సభలోకి రాకుండా ఎన్ని విధాలుగా వీలుంటే అన్ని విధాలుగానూ అడ్డుకుంటోంది. 2015లో అసెంబ్లీలో రోజా అనుచితంగా ప్రవర్తించిందని చెప్పి ఏకంగా ఏడాది సస్పెండ్ చేసింది. ఏడాది పూర్తయిపోయింది. మరిక రోజా సభలోకి రావచ్చా? అనుమానమే. ఎందుకంటే, మళ్ళీ రోజాను మరికొంతకాలం సస్పెండ్ చేసేందుకు టిడిపి రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారట.
రోజా కన్నా రేవంత్ పరిస్ధితి కొంత నయం. ఎలాగంటే, తెలంగాణా అసెంబ్లీలో టిఆర్ఎస్ ఏకపక్ష నిర్ణయాలను ప్రతిపక్షంలోని కాంగ్రెస్, భాజపాలు గట్టిగా అడ్డుకుంటున్నాయి. సభలోనే నిలదీస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వెళుతోంది టిఆర్ఎస్. ఏపిలో ఉన్నదే ఏకైక ప్రతిపక్షం వైసిపి. అందుకనే ప్రతిపక్ష సభ్యురాలు కావటమే రోజా చేసుకున్న పాపమన్నట్లు వ్యవహరిస్తోంది టిడిపి.
