‘‘మాకు రాజకీయ రంగు పులమద్దు’’

‘‘మాకు రాజకీయ రంగు పులమద్దు’’

కర్ణాటక రాజకీయాల్లో తెలుగువారు కీలకంగా మారారు. ఎన్నో సంవత్సరాలుగా కొందరు తెలుగువారు బెంగళూరులో స్థిరపడ్డారు. కాగా.. వారు ఏ పార్టీకి ఓటు వేస్తారనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. అక్కడి తెలుగువారు బీజేపీకి ఓటు వేయవద్దంటూ టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. అయితే.. దీనిపై అక్కడి తెలుగువారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో ఉన్న తెలుగువారికి రాజకీయ రంగు పులమొద్దని తెలుగు ప్రజలు విజ్ఞప్తి చేశారు. మరో కర్ణాటక–తమిళనాడు సమస్యగా మార్చవద్దని, ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి అవకాశాలు లేక తామందరం బెంగళూరుకు వలస వచ్చి బతుకుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత వల్లే తమకీ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు.

బుధవారం కర్ణాటకలో తెలుగువాడి ఓటు ఎవరికి అంటూ ఒక తెలుగు టీవీ చానెల్‌ చర్చ నిర్వహించింది. ఇందులో అన్ని పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, తెలుగు సంఘాలు పాల్గొన్నాయి. కర్ణాటకలో కన్నడిగులు తమతో సోదర భావంతో ఉన్నారని, మాకు, వారికి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. తమపై ఒక పార్టీ ముద్ర వేయడం ద్వారా ఇక్కడి ప్రజలకు తమకు మధ్య విద్వేషాలు పెరుగుతాయని చెప్పారు.

తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నామో, ఏ నాయకుడు అయితే మేలు చేకూర్చుతారని విశ్వసిస్తామో వారికే ఓటు వేస్తామన్నారు. బెంగళూరులో తాము చాలా ప్రశాంతంగా ఉన్నామని, ఇక్కడికొచ్చి బీజేపీకి ఓటు వేయొద్దు.. కాంగ్రెస్‌కు ఓటెయొద్దు అంటూ పిలుపునివ్వడం సమంజసం కాదని తెలిపారు. ఇటీవల ఇక్కడకు వచ్చిన ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బీజేపీకి ఓటు వేయొద్దని కోరడం సరికాదని చెప్పారు. ఇలాంటి మాటలతో తెలుగువారిపై ద్వేషభావాలు పెరుగుతాయని చెప్పారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos