తెలుగురాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ  (బిజెపి) చెన్నై తరహా రాజకీయం జరపాలనుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


ఈ రెండు రాష్రాలలో స్వతహాగా ఎన్నికల్లో పోటీ చేసి పెద్ద పార్టీగా అవతరించి, అధికారలోకి రావడం కష్టమని ఈ పార్టీ భావిస్తున్నది.

 అందువల్ల ప్రతిపక్ష పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలకు, పదవుల్లేని ప్రముఖ నాయకులకు, అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులకు గాలం వేసేందుకు పార్టీ ప్రయత్నిస్తున్నంది. ఇందులో భాగంగానే, ఇతర పార్టీల నాయకులను హోల్ సేల్ గా వశపర్చుకోవడంలో దిట్టఅయిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రెండు రాష్ట్రాలలో పర్యటించబోతున్నారు. వచ్చే నెలలో షా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. దీనికోెసం  ముఖ్యమంత్రిని ఇరుకునపెట్టే పెద్ద వ్యూహంతో  షా వస్తున్నారు.

 

ఏప్రిల్ 28నుంచి మూడు రోజులు అంధ్రలో ఉంటారు. మొదటి రోజున పార్టీ నాయకులతో మాట్లాడతారు. రెండోరోజు బూత్ కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. రాష్ట్రంలో మొత్తం 42600 పోలింగ్ బూతులున్నాయి. ఇక్కడి నుంచి పార్టీ ని పటిష్టం చేయాలన్నది ఆయన వ్యూహం ద్వారానే  ఆయన ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పార్టీని గెలిపించారు. ‘ ఇప్పటిదాకా 20 వేల బూతుకమిటీలను ఏర్పాటుచేశాం. అమిత్ షా వచ్చే నాటికి అన్ని బూత్ కమిటీలను ఏర్పాటుచేయాలని ధ్యేయం. దాని సమీక్షించేందుకు  ఈరోజు విశాఖ సమావేశమవుతున్నాం. ఒక్కొక్క బూత్ కమిటీ నుంచి కనీసం అయిదు మందిని రప్పించి దాదాపు రెండు లక్షల మందితో అమిత్ సమావేశమవుతారు. ఈ బలంతో వచ్చే ఎన్నికలలో మేం చాలా సీట్లలో పోటీ చేస్తాం.అవసరమయితే అన్ని స్థానాలకు పోటీచేస్తాం,‘ అని  పార్టీ సీనియర్ నాయకు లొకరు విశాఖ నుంచి ఏసియా నెట్ కు చెప్పారు. 

 

ఈ పర్యటనకు పార్టీ నాయకులు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నదిందుకే.  మరొక విషయం , ముందస్తు ఎన్నికలమీద ప్రధాని చర్చ లేవదీసిన సంగతి తెలిసిందే. ఇపుడున్న వాతావారణంలో ప్రధాని సూచనను కాదనే ముఖ్యమంత్రులెవరూ లేరు.కాబట్టి చర్చలో విషయం తేలుతుందో వేరే చెప్పనవసరం లేదు. ఈ చర్చల మధ్య  మే నెలలో అమిత్ షా రాష్ట్ర పర్యటన ఉంది. అంతే కాదు,  జూలైలో విశాఖపట్టణంలో  జాతీయ సభల నిర్వహణకు సంబంధించి కూడా ఆయన తన పర్యటనలో ఆదేశాలిస్తారు. ఈ మధ్య వచ్చే ఎన్నికలలోబిజెపి స్వతంత్రంగా పోటీచేయాలనే నినాదం కూడా జోరుగు వినబడుతూ ఉంది. ఈ నినాదం ఆచరణ సాధ్యమవునా కాదా అనేది రాష్ట్ర నాయకుల  సమాచారం ప్రకారం కాకుండా తన సొంత పర్యటన ల ద్వారా తర్వాత జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా అమిత్ షా గ్రహిస్తారు.

 

బిజెపి ఆహ్వానానికి  ఇతర పార్టీల ఎమ్మెల్యేలనుంచి , సీనియర్ నాయకులనుంచి వచ్చే స్పందనను బట్టి పార్టీ  ఈ విషయం మీద తుది నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ‘అన్ని పార్టీలలో కొంతమంది నాయకత్వంతో అసంతృప్తితో ఉన్నారు. వారంతా బిజెపి వైపు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణ కు నెల్లూరు జిల్లా అనం బ్రదర్స్ ఉన్నారు. వారిపుడు టిడిపిలో ఉండలేరు, వైసిపిలోకి పోయేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇలాగే తెలుగుదేశం ఎంపి శివప్రసాద్ కూడా.   ఈ నాయకులతో  బిజెపి సీనియర్ నాయకత్వం టచ్ లో ఉన్నట్లుంది.’ అని  వైజాగ్ సమావేశానికి వచ్చిన రాయలసీమకు చెందిన మరొక  నాయకుడు  ఏసియానెట్ కు తెలిపారు.

 

‘ఇలాంటి నాయకులు బిజెపి వైపు వస్తే, తెలుగుదేశంతో కలసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే, అపుడు బిజెపి ఎక్కువ స్థానాలు డిమాండ్ చేస్తుంది. అది టిడిపికి ఇష్టం ఉండదు. అది ఎన్డీయే విడిపోయేందుకు దారితీయవచ్చు’ అని ఆయన చెప్పారు.

 

అందువల్ల అమిత్ షా పర్యటన, విశాఖ లో జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం ఆంధ్రలో బిజెపి భవిష్యత్తును నిర్ణయిస్తాని పార్టీ నాయకులు భావిస్తున్నారు. మరొక విషయం, నరేంద్ర మోదీ హవా కొనసాగుతున్నపుడే బిజెపి ఇక్కడ బలపడగలదని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఇపుడీ అవకాశం జారి విడిస్తే బిజెపి ఎప్పటికీ టిడిపికి ఉపగ్రహం లాగా ఉండాల్సి వస్తుందని వాళ్ల భయం. ఒక వేళ  బిజెపి టిడిపితో నే కలసి వెళ్లాలనుకుంటే, పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ వంటి కొంతమంది నాయకులు పార్టీని వదలిపెట్టి వైసిపివైపు వెళతారనే  అనుమానం కూడా కొంతమంది బిజెపి నాయకులలో ఉంది.