టీం ఇండియా విరాట్ కోహ్లీ.. బోర్డ్ ఎగ్జామ్స్ కి రావడం ఏమిటి... ? అని ఆశ్చర్యపోతున్నారా..? మీరు చదివింది నిజమే. కాకపోతే.. నిజంగా కోహ్లీ ఎగ్జామ్‌కు హాజరుకాలేదు. కానీ, కోహ్లీ గురించి వ్యాసం రాయాలని పదో తరగతి విద్యార్థులకు ఓ ప్రశ్న వచ్చింది. అంతే.. తమ అభిమాన క్రికెటర్ గురించి రాయాలంటూ ప్రశ్న రావడంతో.. విద్యార్థులంతా ఆనందంతో గంతులేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి బోర్డ్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. కాగా.. ఈ పరీక్షల్లో ‘‘ విరాట్ కోహ్లీ గురించి రాయండి’’ అంటూ ప్రశ్న అడిగారు. ఇక అంతే.. విద్యార్థులు రెచ్చిపోయారు. విరాట్ రికార్డుల మోత అక్షరాల రూపంలో దించేశారు.  

‘ప్రశ్నపత్రంలో కోహ్లీపై ప్రశ్న చూడగానే ఎంతో సంతోషం కలిగింది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకు కోహ్లీ గురించి తెలిసిందంతా టకటకా రాసేశాను. ఇది పది మార్కుల ప్రశ్న. పదికి పది వచ్చేస్తాయి’ అని పట్టరాని సంతోషంతో అలీ అనే విద్యార్థి చెప్పాడు. ‘అసలు కోహ్లీ గురించి ప్రశ్న అడుగుతారని నేను ఊహించలేదు. అతను నా ఐడల్‌’ అని మరో విద్యార్థి షమీమ్‌ అక్తర్‌ తెలిపాడు.