టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో ప్రముఖ సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే పలు సంస్థలకు కోహ్లీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

 ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘ఓ క్రికెటర్‌గా నేను చాలా ప్రదేశాల్లో పర్యటించాను. ఉబర్‌లో బుకింగ్ చేసుకోవడంలో మంచి అనుభూతి ఉంది వ్యక్తిగతంగా చాలా ఎంజాయ్ చేశాను. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లేలా ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, లక్షలాది మందికి ఆర్థిక అవకాశాలు కల్పించడం గొప్ప విషయం. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలకు సేవలందిస్తున్న కంపెనీతో చేతులు కలపడం చాలా ఆనందంగా ఉంది’’ అని కోహ్లీ చెప్పాడు.

కాగా.. ఉబర్ కి కోహ్లీ ప్రచారకర్తగా ఉండటాన్ని కొందరు అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా.. కొందరు మాత్రం సందేహం వ్యక్తం చేస్తున్నారు.  ఉబర్ క్యాబ్ డ్రైవర్లు గతంలో మహిళలపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో ఆ కంపెనీ క్యాబ్ లు వివాదంగా మారిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దీంతో.. ఇలాంటి వివాదాస్పద కంపెనీ కి కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమేంటని పలువురు సందేహపడుతున్నారు.