అమరావతిలో ఎంత పెద్ద తప్పు జరుగుతూ ఉందో డాక్టర్ ఇఎఎస్ శర్మ(రిటైర్డు) చెబితే ఎవరి చెవికెక్కలేదు. బొలిశెట్టి సత్యనారాయణ, శ్రీమన్నారాయణ  ఎన్ జిటి లో కేసు వెస్తే తిడుతున్నారు. అయితే, అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కట్టే అర్కిటెక్టుకోసం  భూతద్దాలు పట్టుకుని ముఖ్యమంత్రి స్వయానా,మంత్రులు, అధికారులు, అనధికారులు ప్రపంచమంతా చక్కర్లు కొట్టారు. కెసినోలు, రెస్టరాంట్లు, పైవ్ స్టార్ హోటళ్లు ఇలాంటి వన్ని కట్టి  అమరావతి వరల్డ్ క్లాస్ అవుతుందని అరుస్తున్నారు. అయితే, అమరావతిలో పెద్ద తప్పు జరుగుతూ ఉందంటున్నారు  నిపుణులు.  వర్ ల్డ్ క్లాస్ అమరావతి కట్టబోయి, ప్రపంచంలోనే  విశిష్టమయన గ్రీన్ సిటి కావలసిన అమరావతి చెడగొడుతున్నారని  విఖ్యాత  అర్బన్ ప్లానర్, జవహర్ లాల్  నెహ్రూ విశ్వవిద్యాలయం ఎమిరిటస్ ప్రొఫెసర్ విక్రమ్ సోని అంటున్నారు.  అమరావతి ఎలా ఉండాలో అధ్యయనం చేసి అరు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఒక ప్లాన్ కూడా పంపించారు. అయితే, ఆ ప్లాన్ మీద స్పందన లేదు. అమరావతి ఎలా ఉంటే ఎయిర్ కండిషన్డు అమరావతి అవుతుందో ఇంకా విపులంగా వివరించేఅవకాశం వస్తుందనే ఆయన ఇంకా ఆశిస్తున్నారు. అమరావతి ఇప్పటి ప్రణాళిక ఎలా తప్పో ఆయన చెప్పారు. వివరాలు:

 

 

అమరావతి కృష్ణానది ఒడ్డున ఉంది.  కృష్ణానది వరదప్రాంతాలను, మినరల్ వాటర్ ను మేం అధ్యయనం చేశాం. ఇది కొత్తగా కడుతున్న రాజధాని నగరం కాబట్టి, మేం  కృష్ణ నది వరదబయళ్లను చూశాం. అక్కడి భూమిలో  చాలా నీరు ఉంది. అంతేకాదు,అవిచాలా సారవంతమయిన భూములు; ఇంత సారవంతమయిన భూములు దేశంలో మరెక్కడా లేవు.ఒక రైతు ఎకరం నుంచి  పదిలక్షల రుపాయల దాకా సంపాయించగలడు.

 

ప్రభుత్వం తయారుచేసిన అమరావతి ప్రణాళిక చూసి మేం విస్తుపోయాం. ఈ సారవంతమయిన వరదబయళ్లలో  కెసీనోలు, రెసార్టులు, సెక్రెటేరియట్ కట్టాలనుకోవడం ఆశ్చర్యం. మొదటి, రెండవ దశలుగా కట్టాలనుకుంటున్న 216 చ.కిమీ విస్తీర్ణం అమరావతిలో  35 చ.కిమీలలో  ఈ సారవంతమయిన వరదబయలుంది. ఈ భూములను కాపాడుకుంటే, మొత్తం అమరావతికి మంచినీళ్లివ్వడమేకాదు, అక్కడి ప్రజలకు  కావలసిన పళ్లు , కూరగాయలు సమృద్ధిగా  అందుతాయి. దదాపు పదిలక్షల మందికి తలా అరకిలో చొప్పున ఈ పళ్లు కూరగాయలందించవచ్చు.

 

ఈ మొత్తం వరద బయళ్లను, జలవనరుగా, పళ్లు కూరగాయలందించే ఉద్యానవనంగా కాపాడుకోవాలని మేం సూచించాం. ప్రఖ్యాత అర్కిటెక్టు, పట్టణనిర్మాణ నిపుణుడు రోమి ఖోస్లాతో కలసి  పనిచేసి, మొత్తం అమరావతిని ఒక చెస్ బోర్డు నమూనాలో నిర్మించే ప్రణాళిక తయారుచేశాం. చెస్ బోర్డులో ఉన్న నల్ల గళ్లన్నీ పచ్చదనం ప్రాంతాలను కోండి. తెల్ల గళ్లన్ని నిర్మాణా ప్రాంతాలు. ఇలా నిర్మిస్తే, అమరావతి ఢిల్లీ కంటే మూడింతలు పచ్చగా ఉంటుంది.

 

ఇలా నిర్మిస్తే ఏమవుతుంది?

 

విజయవాడ, అమరావతి పట్టణాలలో వేసవి ఉష్టోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ దాకా వెళ్తుంది. వేసవిలో టెంపరేచర్ పెరిగినపుడు గాలి వ్యాకోచించి పైకి ప్రసరిస్తుంది. ఈ వేడి గాలి పైకి వెళ్లగానే పచ్చదన ప్రాంతాలలో నుంచి చల్ల టి గాలి   కింది భాగాన్ని ఆక్రమిస్తుంది. అపుడు నిర్మాణాలున్న ప్రాంతాలన్నీ ఆటోమేటిక్ గా  చల్లబడతాయి. దానికి తోడు అక్కడున్న కృష్ణమ్మ ఎపుడూ నిండుగా ఉంటుంది. కృష్ణ నుంచి కూడా చల్లగాలి ఈ ప్రాంతంలోకి వీస్తుంది. ఫలితంగా బయట టెంపరేచర్ కనీసం 5 డిగ్రీల సెల్సియస్ పడిపోతుంది. ఇక సరైన పద్ధతిలో ఆర్కిటక్చరల్ డిజైన్లు అనుసరించి నిర్మాణాలు చేపడితే, భవనాల లోపుల  టెంపరేచర్ మరొక అయిదు డిగ్రీలు పడిపోతుంది.  ఎలాంటి ఎయిర్ కండిషనింగ్ లేకుండా  ఈ ప్రాంతం వేడిన కనీసం 10 డిగ్రీల సెల్సియస్ తగ్గించవచ్చు. దీనితోపాటు, ఎంతో విద్యుత్ ను కూడా పొదుపు చేయవచ్చు.

 

ఈ ప్రణాళిక అమరావతి నగర స్వభావాన్ని పూర్తి మార్చేస్తుంది. విపరీతంగా విద్యుత్ తాగేస్తూ, మనకు నీరు, గాలి  ఇచ్చే ఈ  ఎనలేని సారవంతమయిన వరద బయళ్లను నాశనమచేసుకుంటూ వర్ ల్డ్ క్లాస్ సిటి ని కట్టుకోవడం ఏమిటి? మేం చెప్పిన పద్ధతిలో కట్టుకుంటే  భవిష్యత్తులో రాబోయే మహానగరాలకు అమరావతి మార్గదర్శి అవుతుంది. వర్ ల్డ్ క్లాస్ కాదు, అమరావతి తనదైన క్లాస్ అవుతుంది.

 

మా ప్లాన్ మీద ఒక బుక్ లెట్ తయారుచేసి  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆరునెలలకిందట పోస్టులో పంపించాం. తర్వాత మనుషుల ద్వారా కూడా పంపాం.ప్రభుత్వం మాతో సమావేశమవుతుందనే ఆశతో ఉన్నాం.

 

(ది హిందూ నుంచి. ఆయన ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇక్కడ ఉంది.)