విజయవాడ మేయర్, కార్పొరేటర్ల మధ్య మొదలైన గొడవ.. మరింత  ముదిరి పాకాన పడింది.  కార్పొరేటర్లు మేయర్ పై తిరుగుబాటు ప్రకటించారు. తక్షణమే.. మేయర్ ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మేయర్ విషయం.. ఏకంగా సీఎం చంద్రబాబుతోనే తేల్చుకుంటామని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..

నాలుగు సంవత్సరాలుగా విజయవాడ నగర మేయర్ గా కోనేరు శ్రీధర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన మేయర్ గా ఎన్నికైన నాటి నుంచి టీడీపీ కార్పొరేటర్లకు ఆయనకు పడటం లేదన్నది జగమెరిగిన సత్యం. మేయర్ .. తమను కించ పరుస్తున్నారని.. నీఛంగా మాట్లాడుతున్నారనేది కార్పొరేటర్ల వాదన. కేవలం తమనే కాకుండా సాయం కోసం వచ్చిన చిరు వ్యాపారులతో కూడా శ్రీధర్ వాగ్వాదానికి దిగుతున్నారని కార్పొరేటర్లు వాపోతున్నారు. కనీసం అధికారులతో వ్యవహరించే తీరు కూడా బాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కేవలం పార్టీ మీద అభిమానంతో మేయర్ ని భరిస్తూ వస్తున్నామని ఇక మీద తమ వల్ల కాదని వారు వాపోతున్నారు. ఇప్పటికే కార్పొరేటర్లు ఇదే విషయంపై బుద్ధా వెంకన్నకు లేఖ కూడా రాశారు. తాజాగా.. బుద్ధాతో వారు భేటీ అయ్యారు. మేయర్ ని మార్చకపోతే.. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీ పట్టు కోల్పోవలసి వస్తుందని వారు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వెంటనే ఏదైనా చర్యలు తీసుకోవాలంటే.. తాము సీఎంతో నే విషయం తేల్చుకుంటామని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.