శశికళను కలిసిన విజయశాంతి
సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి త్వరలో ‘అమ్మ’ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. శనివారం జయలలిత సన్నిహితురాలు శశికళను విజయశాంతి కలిసిన విషయం తెలిసిందే.
చెన్నైలోని పోయెస్ గార్డెన్‌కు వెళ్లిన విజయశాంతి.. శశికళతో సమావేశమయ్యారు. అన్నాడీఎంకే పార్టీని ముందుండి నడిపించాలని ఈ సందర్భంగా ఆమె శశికళను కోరినట్లు సమాచారం.
మెరీనా బీచ్ ఒడ్డున ఉన్న జయలలిత సమాధిని కూడా విజయశాంతి ఈ సందర్భంగా దర్శించుకున్నారు. పూలమాల వేసి అంజలి ఘటించారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే విజయశాంతికి మొదటి నుంచి అభిమానం ఉంది. తాను రాజకీయాల్లోకి రావడానికి జయలలితే రోల్ మోడల్ అని విజయశాంతి చాలా సార్లు చెప్పారు.
అంతేకాదు విజయశాంతికి తమిళనాడుతో విపరీతమైన అనుబంధం ఉంది. విజయశాంతి మొదటి చిత్రం కళ్లుక్కుళ్ ఈరమ్. తమిళ చిత్రమే. ఈ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. దీనికి ప్రసిద్ధ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించారు.
తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కు తరలివచ్చినా కూడా విజయశాంతి చాలా ఏళ్లు అక్కడే ఉన్నారు. అంతేకాదు తెలుగు తో పాటు రాములమ్మ చాలా తమిళ సినిమాల్లో నటించారు.
ఇక టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకున్న ఏకైక హీరోయిన్ విజయశాంతి. ప్రస్తుతం సినిమాలకు దూరమైన వెండితెరపై ఆమె వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదే.
గతంలో తల్లి తెలంగాణ పేరుతో ఒక పార్టీని కూడా పెట్టారు. తాను పుట్టింది తెలంగాణ లోనే అని చెప్పుకున్న రాములమ్మ అందుకు తగ్గట్టే తెలంగాణ ఉద్యమంలో చాలా క్రీయాశీలంగా పాల్గొన్నారు.
తన పార్టీని టీఆర్ ఎస్ లో కలిపి ఎంపీగా కూడా రాణించారు. తర్వాత కేసీఆర్ తో బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ గూటికి చేరారు.
అయితే ఆ పార్టీలో చేరిన మాటేగాని ఇప్పటి వరకు ఆమె గాంధీ భవన్ కూడా సరిగా రావడం లేదు.
ఈ సమయంలో ఎలాగూ అనుబంధం ఉన్న తమిళనాడు నుంచి మళ్లీ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాలని రాములమ్మ భావిస్తున్నట్లు ఉంది.
