గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీ .. ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం విజయ్ రూపానీకి ఇది రెండోసారి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

2016లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందిబెన్ పటేల్.. కొన్ని కారణాల కారణంగా.. తన పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో.. విజయ్ రూపానీ.. సీఎం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో మరోసారి భాజపా విజయ కేతనం ఎగురవేసింది. అయితే.. గతంతో పోలిస్తే మెజార్టీ తగ్గింది. దీంతో రూపానీని ముఖ్యమంత్రిగా తప్పిస్తారనే వూహాగానాలు వెలువడ్డాయి. ఆ స్థానంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరు బాగా వినిపించింది. అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ రూపానీని శాసనసభాపక్ష నేతగా ఈ నెల 22న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 23న భాజపా రాష్ట్ర నేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు గవర్నర్‌ కూడా ఆమోదించడంతో మంగళవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు.