ఆస్పత్రిలో జయలలిత వీడియో విడుదల చేసిన దినకరన్ వర్గం ఆర్కే ఉప ఎన్నిక ఒక రోజు ముందు వీడియో విడుదల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వీడియో ఒకటి ఇప్పుడు తమిళనాట సంచలనం రేపుతోంది. ఆర్కేనగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఒక్కరోజు ముందు జయలలితకు చెందిన ఈ వీడియోని విడుదల చేయడం గమనార్హం. అమ్మ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను దినకరన్‌ వర్గం బయటపెట్టింది. దినకరన్‌ వర్గానికి చెందిన పి. వెట్రివేల్‌ ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో అమ్మ ఆసుపత్రి బెడ్‌ మీద డ్రింక్‌ తాగుతూ కన్పించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న జయలలితను గతేడాది సెప్టెంబర్‌ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. దాదాపు 45 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న అమ్మ.. చికిత్స పొందుతూ 2016 డిసెంబర్‌ 5న తుదిశ్వాస విడిచారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమెను కలిసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కేవలం ఆమె నెచ్చెలి శశికళ కుటుంబసభ్యులు మాత్రమే జయలలితతో ఉన్నారు. దీంతో అమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఇటీవల పన్నీర్‌ వర్గం నేతలు ఆరోపించారు. దీంతో జయలలిత మృతిపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది.