2019లో మోదీకి అడ్డొస్తానని నన్ను తొలగించలేదు 2020లో రిటైరవుతానని భార్య ఉషకు ఎపుడో చెప్పాను కష్టపడి పనిచేస్తాడు కాబట్టే చంద్రబాబు అంటే ఇష్టం

పబ్లిక్ రాజకీయాల నుంచి తప్పించేందుకే తనను కేంద్ర క్యాబినెట్ నుంచి తప్పించి ఉపరాష్ట్రపతిగా పంపించారని వినపుడుతన్న వాదనను ఎన్ డి ఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఒక ఆత్మీయ సభలో వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తి కరమయిన అంశాలను వెల్లడించారు.
‘2019లో ప్రధాని నరేంద్ర మోదీకి పోటీదారుగా ఉండొద్దనే నన్ను రాజకీయాల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా అవాస్తవం,’ అని వెంకయ్య అన్నారు.
. 2020లో రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకున్న విషయం కూడా చెప్పారు. ఈ విషయాన్ని భార్య ఉషతోఎపుడో చెప్పినట్లు కూడా వెంకయ్య చెప్పారు. అయితే, ఇపుడు ఉప రాష్ట్రపతి అవకాశం వచ్చిందని అన్నారు.
2019లో కూడా మోడీయే ప్రధాని కావాలనేది నా కోరిక అని ఆయన చెప్పారు.
‘నా మీద అభిమానమో లేక దురభిమానమో నాకుతెలియదు గాని, నన్ను తప్పించాలని కొందరు భావిస్తున్నారు. గతంలో బిజెపి నుంచి టిడిపి విడిపోయినప్పుడు నేను ఎలా వ్యవహారించానో అందరికీ తెలుసు. అభివృద్ధికి కృషి చేస్తున్నాడు కాబట్టే నాకు చంద్రబాబు అంటే ప్రత్యేక అభిమానం,’ అని అన్నారు. .
’మా కుటుంబంలో ఎవరూ నెహ్రూ, గాంధీలు కారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను.. చిన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాను. అసెంబ్లీలో అందర్నినీ కడిగిపారేస్తున్నానంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా నన్ను అభిమానించారు. పార్టీలకు అతీతంగా అందరి అభిమానాన్ని సంపాదించుకోగలిగాను,’ అని వివరించారు.
