ప్రకటన చూసి మోసపోయిన ఉపరాష్ట్రపతి వెంకయ్య ఎలా మోసపోయారో స్వయంగా వివరించిన వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మోసపోయారా..? అది కూడా ఓ ప్రకటన చూసి. అవును నిజంగానే ఆయన ఓ ప్రకటన చూసి మోసపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా మనకు టీవీల్లో, పేపర్లలో కొన్ని ప్రకటలను కనిపిస్తూనే ఉంటాయి. తక్కువ కాలంలో బరువు తగ్గిస్తాం. బట్టతలపై జుట్టు పెరగడం లాంటివి. చాలా మంది అలాంటి ప్రకటనలు చూసి ఆకర్షితులౌతారు. తీరా డబ్బులు కట్టాక కానీ అర్థం కాదు మోసపోయామని. ఇలా పొరపాటు పడే తాను మోసపోయానని వెంకయ్యనాయుడు పార్లమెంట్ లో చెప్పడం విశేషం.

నకిలీ ప్రకటనలపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్‌ అగర్వాల్‌ లేవనెత్తిన చర్చలో వెంకయ్య తన అనుభవాన్ని పంచుకున్నారు. వెయ్యి రూపాయలకే బరువు తగ్గొచ్చన్న ఓ ప్రకటనను చూసి.. డబ్బులు చెల్లించి ఆర్డర్‌ బుక్‌ చేశానని తెలిపారు. టాబ్లెట్లు అందిన తర్వాత మెయిల్‌ వచ్చిందని.. మరో వెయ్యి రూపాయలు చెల్లిస్తే అసలైన టాబ్లెట్లను పంపిస్తామని అందులో ఉందని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించి వినియోగదారుల సంబంధిత మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆ ప్రకటన అమెరికా నుంచి వచ్చినట్లు విచారణలో తేలిందని.. ఇలాంటి నకిలీ ప్రకటనలపై చర్యలు తీసుకోవాలన్నారు.