ప్రేమికుల రోజున హైదరాబాద్ నగరం బోసిపోతోంది. ప్రేమికులు కనిపిస్తే పెళ్లి చేస్తామన్న వీహెచ్‌పీ, భజరంగ్‌దల్ హెచ్చరికలతో దాదాపు ఎవరూ పార్కులు తదితర ప్రాంతాల్లో తిరగడం లేదు. దీంతో హైదరాబాద్ నగరంలో బజరంగదళ్ కార్యకర్తలకు పెద్దగా పని పడలేదు. అయితే.. అహ్మదాబాద్ లో మాత్రం రెచ్చిపోయారు.

.మేజర్లు ప్రేమ పెళ్లి చేసుకుంటే పెద్దలు, కాప్ పంచాయతీలు సైతం అడ్డుచెప్పకూడదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా 'వాలెంటైన్స్ డే' మన సంస్కృతి కాదంటూ ప్రేమజంటల వెంటబడి తరమికొట్టిన ఘటనలు దేశవ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని సొంత రాష్ట్రంలోనూ ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ఒడ్డుకు చేరిన ఓ ప్రేమజంటను బజరంగ్ దళ్ కార్యకర్తలు వెంటాడి వేధించారు. కర్రలు పట్టుకుని వారి వెంట పడ్డారు. పరుగులు పెట్టించారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి బజరంగ్ దళ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.