ఎవరైనా తప్పుడు ప్రొడక్ట్స్ అమ్మి.. ప్రజలను మోసం చేస్తే.. వారు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి.. వారిపై కేసు వేస్తారు.. ఇది మనకు తెలిసిని విషయమే. మరి.. వాస్తు ఏజెన్సీలపై కూడా కేసు వేయోచ్చా.. కర్ణాటక రాష్ట్రం విజయపుర ప్రాంతానికి చెందిన మహదేవ్ దుడిహల్ అనే వ్యక్తి అదే పనిచేశాడు.

వివరాల్లోకి వెళితే..రెండు సంవత్సరాల  క్రితం మహదేవ్.. వాస్తు దోషం గురించి టీవీలో వస్తున్న ప్రకటన చూశాడు. వెంటనే వారిని సంప్రదించాడు కూడా. మహదేవ్ దగ్గర నుంచి ఆ సంస్థ ఫీజు  రూపంలో రూ.11,600 వసూలు చేసింది. అంతేకాకుండా.. ఇంటిలో కొన్ని మార్పులు చేయాలని సూచించింది. ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని.. అందుకే మీ కుమార్తెల వివాహం జరగడం లేదని చెప్పారు. వారు చెప్పిన మార్పులు చేస్తే..  మూడు నుంచి ఎనిమిది నెలల్లో కచ్చితంగా మంచి జరుగుతుందని కూడా చెప్పారు.

వాళ్లు చెప్పినట్టే.. మహదేవ్ రూ.5లక్షల ఖర్చు చేసి ఇంటిని రీ మోడలింగ్ చేయించాడు. అలా చేయించి సంవత్సరం గడుస్తున్నా.. వారి ముగ్గురు కుమార్తెలకు వివాహం నిశ్చయం కాలేదు. దీంతో మహదేవ్ విజయపుర జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. అయితే.. ఈ కేసు దానికిందకి రాదని వారు తోసిపుచ్చారు.

అయినా.. పట్టు విడవని విక్రమార్కుడిలా.. ఈ కేసుని రాష్ట్ర వినియోగదారుల ఫోరం ముందు ఉంచాడు. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లో ఉంది. మహదేవ్.. ఆ కంపెనీ మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.

ఈ విషయంపై మహదేవ్ న్యాయవాది ప్రదీప్ అనంతపుర్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తిగానీ, సంస్థ గానీ  వ్యాపారం చేస్తున్నప్పుడు నాణ్యతలేని ప్రొడక్ట్ ని  లేదా సర్వీస్ ని అందజేస్తే.. వారికి కచ్చితంగా శిక్ష ఉండాలన్నారు. వాస్తు ఏజెన్సీలు కూడా వీటి కిందకే వస్తాయని.. ఎందుకంటే వాళ్లు వినియోగదారుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. అలా కాదంటే వారు ఉచితంగా సర్వీసు చేయాలి తప్ప ఫీజులు తీసుకోకూడదన్నారు.

అనంతరం మహదేవ్ మాట్లాడుతూ.. సిద్ధారామయ్య ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాస్తు దోషాలను కూడా మూఢనమ్మకాల కింద చేర్చాలని డిమాండ్ చేశాడు.