ఒక్క మణిపూర్ తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల ప్రజలు చెప్పిందొకటే మాట: ఉన్న ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయలేదు. మార్పు అవసరం, అని.
ప్రధాని నరేంద్రమోదీకే కాదు, ఆయన తెలుగు మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఇపుడు ఫలితాలు అందించిన అయిదు రాష్ట్రాలు రానున్న పరిస్థితి గురించి బిగ్గరగా హెచ్చరిక చేశాయి.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో అఖండ విజయం తో నోట్ల రద్దు (డిమానెటైజేషన్)కు ప్రజామోదం లభించిందని మిద్దె ఎక్కి చేతులూపుతూ మోదీ పెద్ద గట్టిగా అరవలేని పరిస్థితి. ఉత్తర ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో బిజెపి అఖండ విజయమని మోదీని గట్టిగా అభినందించ లేని పరిస్థితి చంద్రబాబుది. మోదీ పంజాబ్ లో , గోవాలో, మణిపూర్ లో చెల్లుబాటు కాలేదు. కొత్త సీట్లు రాకపోవడం కాదు, వున్నవి వూడాయి. అందుకని బిజెపి ఈ పాక్షిక విజయానికి కొత్త భాష్యం వెదుక్కోవాలసి ఉంది.
మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిస్థితి ఏమిటి?
నిజానికి, ఉత్తరాదిలో ఎన్ డిఎ ఓడినా గెల్చినా నాయుడికి పెద్దగా పోయేది లేదు.అయితే, రాజకీయ పరిణామాలు అలా ఒకరాష్ట్ర సరిహద్దుల్లోని ఇరుక్కుపోయి ఉండవు.
అందుకే, ఇపుడు ఎదురయిన జయాపజయాలు నాయుడి కళ్లలోకి సూటిగా చూస్తున్నాయి.
ఈ జయాపజయాల విశ్లేషణ మొత్తం ఆంధ్ర చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే, ఒక్క మణి పూర్ తప్ప గతా నాలుగు రాష్ట్రాల ప్రజలు చెప్పిందొకటే మాట: ఉన్న ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయలేదు. మార్పు అవసరం, అని.
ఇది చంద్రబాబు నాయుడి కి ఇబ్బందికరమయిన సందేశం.
ఎందుకంటే, యాంటి ఇంకంబెన్సీ (ప్రభుత్వ వ్యతిరేకత) అన్ని రాష్ట్రాల్లో కనిపించింది. అది మోదీకి కొంత , కాంగ్రెస్కు దండిగా పనికొచ్చింది. కాంగ్రెస్కు వూపిరి పోసినట్లయింది. ఈ ధియరీని ఇంకా ముందుకు తీసుకుపోయి 2019లో యాంటిఇంకంబెన్సీలో మోదీ ప్రభుత్వం పోతుందని, తన కు ప్రయోజనం ఉండవచ్చని, రానున్నవి మంచిరోజులనికాంగ్రెస్ కలకంటూ వచ్చే ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూడవచ్చు.
మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి?
యాంటిఇంకంబెన్సీ (ప్రభుత్వం మీద వ్యతిరేకత)ను ఎదుర్కొనేందుకు ఆయన ఇక కష్టపడాలి. అది ఉత్తరం, మాది దక్షిణం. ఈ రెంండు వేరు అని వాదించాలి.
ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పనితీరంతా కాకి లెక్కలు, గాలి కబుర్లు తప్ప భూమ్మీదేమీ జరగలేదని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. అభివద్ధి రేటు 11 శాతం దాటింది, వచ్చే ఏడాది 15 శాతం అని అంటే ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే దాని వల్ల ఒక ఉద్యోగం వచ్చిందిలేదు, పైస రాబడి పెరిగిందీ లేదు. ఇక విశాఖ పెట్టుబడుల ఎమ్వోయు లు. అదొక బ్రహ్మ పదార్థం. పదిలక్షల కోట్ల విలువయిన ఎమ్వోయు లు జరిగితే, ‘ఇన్వెస్టర్ అనేవాడు సప్త సముద్రాల అవతల దాక్కున్న పట్టుకురండి,’ అని ఆఫీసర్లందరిని ప్రపంచ యాత్రకు ఎందుకు పురమాయిస్తున్నట్లు?
ఇదే విధంగా అమరావతి గాలిలో లేస్తున్నది గాని, భూమ్మీద ఒక్క ఇటుకపడటం లేదు. ఇపుడు పట్టిసీమ బోగస్ అని , రు. 135 కోట్ల కరెంటు బిల్లు కట్టి, గోదావరి నీళ్లు తోడి సముద్రంలోకి వదిలారని ప్రతిపక్షనాయకుడు లెక్కలతో సహా చూపించాడు.
భూసమీకరణ కుంభకోణమని, భూసేకరణ అంటే రైతుల భూములు లాక్కోవడమేనని ప్రతిపక్ష పార్టీలన్నీ అరుస్తున్నాయి. ఇలాంటపుడు యాంటి ఇంకంబెన్సీ (ప్రభుత్వ వ్యతిరేకత) కనిపించకమానదు.
వీటికి తోడు చెప్పి చేయని హామీలు (ప్రత్యేక హోదా,ఇంటింటికి ఒక ఉద్యోగం. ఉద్యోగం లేని వాడి భృతి, కాపులకు బిసి హోదా, బోయలకు ఎస్టీ హోదా....). వీటిని పట్టుకుని జగన్ ఒక వైపు,సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ మరొక వైపు రాష్ట్రమంతా తిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ గురించి ఎక్కువ అలోచించాల్సింది అఖిలేష్, రాహుల్ కాదు, చంద్రబాబేనమో అనిపిస్తుంది.
బాబు వివరణ, స్పందన ఎలా ఉంటుందో చూద్దాం.
