Asianet News TeluguAsianet News Telugu

బ్యాంక్ ఖాతాలు ఎలా ఖాళీ చేస్తున్నారో తెలుసా?

  • దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు
  • పది నెలల్లో రూ.3కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
  • సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు
Two held on cyber crime offences

రమేష్.. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను తన లావాదేవిలన్నింటినీ ఆన్ లైన్ లోనే చేస్తాడు. అలా చేస్తుండగా ఒక రోజు పొరపాటుగా రూ.1000 కట్ అయ్యాయి. ఈ విషయమై బ్యాంకు కస్టమర్ కేర్ కి ఫిర్యాదు చేయగా.. తమ అధికారి మీకు ఫోన్ చేస్తాడంటూ వాళ్లు సమాధానమిచ్చారు.  వాళ్లు చెప్పినట్టుగానే మరుసటి రోజు రమేష్ కి బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి.. పాస్ వర్డ్,  ఓటీపీ నెంబర్లు తీసుకున్నాడు. అంతే.. ఫోన్ కాల్ కట్ అయిన రెండు నిమిషాల్లో.. తన బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ అయ్యింది. ఇదేమిటని మళ్లీ బ్యాంక్ కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే.. తమకు ఆ ఫోన్ కాల్ తో ఏ సంబంధం లేదని చెప్పేశారు. దీంతో... రమేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేవలం ఒక్క రమేష్ మాత్రమే కాదు ప్రస్తుత రోజుల్లో చాలా మంది సైబర్ నేరాలకు బలౌతున్నారు. కేవలం పది నెలల్లో రూ.3కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేసారంటే తెలిసిపోతోంది.. ఈ మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో. నెలలో చాలామంది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

బాధితులకు వచ్చిన ఫోన్‌కాల్స్‌ ఆధారంగా ప్రాథమిక ఆధారాలను సేకరించగా డెబిట్‌కార్డుల సేవల కోసం జాతీయ బ్యాంకులు నియమించుకున్న పొరుగు సేవల నుంచి నేరగాళ్లు సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది. వారికి కొంత డబ్బు చెల్లించి మరీ డెబిట్ కార్డు వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తున్నారని తేలింది.

గత కొంతకాలంగా దేశంలో పలు సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరస్థులను ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని   వికాస్‌కుమార్‌ రవానీ, మనీష్‌ బర్‌వాల్‌ గా గుర్తించారు.  వీరిద్దరు కేవలం 5 నెలల్లో రూ.20 లక్షల నగదును కొల్లగొట్టారు. వీరిచ్చిన సమాచారం ద్వారా మరికొన్ని ముఠాల సమాచారం తెలుసుకున్నారు. ముఠాల్లో సభ్యులను అరెస్ట్‌ చేసేందుకు కొద్దిరోజుల్లో దిల్లీ, కోల్‌కతా, బిహార్‌ వెళ్లనున్నారు.

వీరిద్దరినీ పోలీసులు విచారించగా.. వారు ఏవిధంగా ఈ నేరాలకు పాల్పడ్డారో వివరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన వికాస్‌, మనీష్‌ చిన్నచిన్న మోసాలు చేసేవారు. క్రెడిట్‌కార్డు వినియోగదారులను మోసం చేయవచ్చని తెలుసుకున్నాక ఏడాదిన్నర క్రితం కోల్‌కతాకు వెళ్లారు. అక్కడ ఇద్దరూ చెరో గది అద్దెకు తీసుకున్నారు. కొద్దిరోజులకు తన ఇంటి ఎదురుగా ఉన్న యువతితో వికాస్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఆమె ఎస్‌బీఐ డెబిట్‌కార్డు వినియోగదారుల సేవాకేంద్రంలో పనిచేసేది. దేశవ్యాప్తంగా డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించి వాటిని బ్యాంకు అధికారులకు తమ సంస్థ ద్వారా పంపుతోంది. ఈక్రమంలో ఫిర్యాదిదారుల కార్డు నంబర్లు, పేర్లు, ఫోన్‌నంబర్లను వికాస్‌కు ఇచ్చేది. ఈ వివరాలను తీసుకున్న వికాస్‌.. కార్డుదారులతో బ్యాంకు అధికారిలా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తానంటూ నమ్మించి ఓటీపీ నంబర్లు, పాస్‌వర్డ్‌ లు తీసుకునేవాడు. వివరాలు ఫోన్‌లో తీసుకునేప్పుడు పక్కనే మనీష్‌ ఉండేవాడు. వికాస్‌ ఓటీపీ నంబర్లు, సంకేత నంబర్లు చెప్పిన క్షణాల్లోనే ఆయా డెబిట్‌కార్డు వినియోగదారుల ఖాతాల్లోని సొమ్మును ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసేవాడు. వినియోగదారులు మళ్లీ ఫోన్లు చేస్తారన్న ముందస్తు అంచనాతోనే సిమ్‌కార్డులను తీసేసేవారు. స్వాహా చేసిన సొమ్మును వాటాలుగా పంచుకునేవాళ్లమని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios