చిత్ర ప్రదర్శన మధ్యలోనే పోలీసుల ప్రవేశం, అరెస్టు, కేసు నమోదు

సినిమా హల్లో జాతీయ గీతం ప్రసారం అయ్యే సమయంలో నిలబడనందుకు హైదరాబాద్ లో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలా సినిమా హాల్లో చిత్ర ప్రదర్శన మధ్యలో పోలీసులు వచ్చి జాతీయ గీతం కేసులో అరెస్టుచేయడం ఇదే ప్రథమం కావచ్చు. ఈ సంఘటన శనివారం నాడు తెలంగాణా రాజధాని హైదరాబాద్, కాచిగూడలోని ఐనాక్స్ ధియోటర్ లో జరిగింది. వారి మీద ప్రివెన్షన్ ఆఫ్ నేషనల్ ఆనర్స్ యాక్ట్,1971, సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు. తర్వాత వారిని పూచీకత్తు మీద విడుదల చేశారు.

కాచిగూడలోని ఐనాక్స్ థియేటర్ లో చిత్రాంగద చిత్రం ప్రదర్శన సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో అంతా లేచి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. అయితే సయిద్ షఫీ హుస్సేన్ , మహ్మద్ ఇలియాస్ అనే ఇద్దరు వ్యక్తులు మాత్రం తమ సీట్లలో కూర్చునే ఉండటం ఆ ప్రక్కనే ఉన్న ఒక టెలివిజన్ జర్నలిస్ట్ గమనించారు.నిలడి గీతం ఆలపించాలని వారికి సలహా ఇచ్చారు.

అయితే, వారు ఖాతరు చేయచేయకుండా అలానే కూర్చొని ఉన్నారట. దీనితో కోపమొచ్చిన జర్నలిస్టు పోలీసులకు సమాచారం అందించాడు. పక్కనే ఉన్న సుల్తాన్ బజార్ పోలీసులు సినిమా మధ్యలో హాల్లో చొరబడి ఇద్దరిని అదుపు లోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే హుస్సేన్ అనే వ్యక్తి తన కాలు నొప్పిగా ఉండడం వలనే నిల్చోలేదని వివరణ ఇచ్చాడట.

ఇందులో హుసేనీ ఆస్ట్రేలియాలో పనిచేస్తుంటారు. పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చాడు.