ఓ సీనియర్ టెలివిజన్ జర్నలిస్టుపై లోకల్ ట్రైన్ లో  కొందరు యువకులు దాడి చేసిన ఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. అసలు విషయం ఏమిటంటే.. సుధీర్ శుక్లా ఒక ప్రముఖ హిందీ న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం అతడు మీరా రోడ్ నుంచి అంధేరి వెళ్లే లోకల్ ట్రైన్‌లో ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఐతే లోపల ఖాళీ లేదని ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారికి శుక్లాకు మధ్య వాగ్వాదం జరిగింది. వారితో వాదిస్తూనే.. శుక్లా ట్రైన్ లోకి దూరాడు. లోపలికి వచ్చిన అతనిని అక్కడున్న కొంత మంది ప్రయాణికులు వేధించడం మొదలెట్టారు. వారి ఫొటోలు తీసేందుకు శుక్లా ప్రయత్నించగా అతని ఫోన్‌ను కూడా వారు లాగేసుకున్నారు.

దీంతో శుక్లా కూడా.. వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో.. దాదాపు ఎనిమిది మంది యువకులు అతడిపై దాడికి పాల్పడ్డారు.  దాంతో.. శుక్లా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం శుక్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.