టిఎస్ పిఎస్ సి మీద వస్తున్న కేసులు కావాలనే వేస్తున్నారేమో అని ఛెయిర్మన్  ఘంటా చక్రపాణి అనుమానిస్తున్నారు 

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ మీద పడుతున్న కోర్టు కేసుల మీద ఛెయిర్మన్ ఘంటా చక్రపాణి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కోర్టు కేసుల వల్ల గాడితప్పిన సంగతి తెలిసిందే. ఇది యుకుకుల్లో బాగా అసంతృప్తి కారణమయింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ చక్రపాణి ‘నమస్తే తెలంగాణ’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వివరంగా వివరణ ఇచ్చారు.ఈ కేసులు వేస్తున్నవారి మీద ఇలా వ్యాఖ్యానించారు...

‘‘అభ్యర్థులు, ఆశావహులతో సహా పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని కేసుల తీరును విశ్లేషిస్తే ఉద్దేశపూర్వకంగా వేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతున్నది. దురుద్దేశపూర్వకంగా వేసే కేసులతో కమిషన్‌కు ఇబ్బంది అవుతున్నది. పనిపై ప్రభావం చూపుతున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్-1 పరీక్షను టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఒకే రోజున నిర్వహిస్తే.. అలా చేయడంవల్ల ఏపీ అభ్యర్థులు తెలంగాణలో పరీక్ష రాసే అవకాశం కోల్పోతారని కోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటివి తెలంగాణ అభ్యర్థుల మనోైస్థెర్యాన్ని దెబ్బతీస్తాయి. గురుకులాల కోర్టు కేసు విషయంలో ఫిబ్రవరిలో ప్రకటన వస్తే.. పరీక్ష జరుగుతున్న నెలలో కోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షలు ముగిసే సమయంలో ప్రక్రియ వాయిదా పడింది. తద్వారా వేలమంది అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. ఇది కమిషన్ పనితీరును సైతం ప్రభావితం చేస్తున్నది. గతంలో సర్వీస్ కమిషన్ ఉద్యోగులే కోర్టు కేసులను పర్యవేక్షించగా, ఇప్పుడు ప్రత్యేకంగా చేజింగ్ సెల్ ఏర్పాటుచేశాం. ఇందులో మా కమిషన్ సభ్యులైన ముగ్గురు న్యాయనిపుణులు ఉన్నారు. న్యాయకోవిదులు మంగారి రాజేందర్, విద్యాసాగర్‌రావు, కృష్ణారెడ్డితోపాటు ఉద్యోగులతో కూడిన ప్రత్యేక విభాగం ఏర్పాటుచేశాం. కోర్టు కేసు నమోదయిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయించి, నియామక ప్రక్రియ జాప్యం కాకుండా చూస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వపరంగా అడ్వకేట్ జనరల్‌తో సమన్వయం చేసుకొని ఉద్యోగార్థులకు సేవలందిస్తున్నాం.’’