మంచిర్యాల పట్టణంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా అధికార పార్టీ ఎంపీ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. మంచిర్యాల పట్టణంలో వున్న పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఎంపి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఏమేం చోరీ అయ్యాయో ఇంకా తెలియలేదు.

మంచిర్యాల గౌతమ్‌నగర్‌లోని ఎంపీ సుమన్ ఇంటితో పాటు మరో మూడు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఓ ఇంట్లో రూ. లక్ష నగదును దొంగలు అపహరించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎంపీ ఇంటితో పాటు మిగతా ఇళ్లలో యజమానులు లేకపోవడంతో చోరీ సొత్తు లెక్కలు తెలియడం లేదు. ఈ మద్య రెండు నెలల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో ఇది రెండో దొంగతనం. ఎంపీ ఇంటికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  
 
ఎంపీ సుమన్ ఇంట్లో చోరీ ఘటనలపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటితో పాటు మిగతా మూడు ఇళ్లను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  మొదలుపెట్టారు.