బుగ్గ చరిచాడు.. సారీ చెప్పాడు

First Published 18, Apr 2018, 2:55 PM IST
TN governor apologises for patting woman journalist’s cheek following outrage
Highlights

మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన గవర్నర్

తమిళనాడు గవర్నర్ భ‌న్వ‌రిలాల్‌ పురోహిత్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మహిళా పాత్రికేయురాలు లక్ష్మీ సుబ్రమణియన్‌తో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. ద వీక్ పత్రిక జర్నలిస్టు లక్ష్మీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేస్తూ ఆమె చెంపను తట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గవర్నర్ పురోహిత్ ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడులో ఇటీవల సంచలనం రేపిన ప్రొఫెసర్ నిర్మలా దేవి అంశంపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అనేక ప్రశ్నలకు ఆ కాన్ఫరెన్స్‌లో గవర్నర్ సమాధానం ఇచ్చారు. ప్రొఫెసర్ నిర్మలాదేవి ఓ కాలేజీకి చెందిన నలుగురు అమ్మాయిలను సెక్స్‌వర్క్‌లుగా మార్చేందుకు ప్రయత్నించింది. ఆ అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. ఆ వివాదాస్పద ప్రొఫెసర్‌కు గవర్నర్ పురోహిత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను గవర్నర్ కొట్టిపారేశారు. చాలా ఆగ్రహంగా ఆయన సమాధానాలు ఇచ్చారు. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసే సమయంలో జర్నలిస్టు లక్ష్మీ ఓ ప్రశ్న వేసింది. ప్రభుత్వ పర్ఫార్మెన్స్‌తో సంతృప్తికరంగా ఉన్నట్లు మీరు తెలిపారు కాదా, మరి రాష్ట్రంలోని వర్సిటీల పనితీరు బాగుందని మీరు భావిస్తున్నారా అని ఆమె అడిగారు. ఆ సమయంలో కూర్చీలోంచి లేచిపోతూ.. గవర్నర్ పురోహిత్ ఆ జర్నలిస్టు బుగ్గను తట్టారు. అంతే.. గవర్నర్ అనుచిత ప్రవర్తన వివాదాస్పదమైంది.

ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గవర్నర్ వెంటనే క్షమాపణలు తెలిపారు. మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే ఆమె చెంపను తాకానన్నారు. తన చర్య వల్ల ఆ మహిళా జర్నలిస్టు బాధపడినందు వల్ల ఆమెకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని  గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ కోరారు.

loader