రూలు ఫాలో కావాలా? మినహాయింపు తెచ్చుకోవాలా? ఇది ఇపుడు ఏడుకొండల వాడికి ఎదురవుతున్న ఐహిక సమస్య.
రూలు ఫాలో కావాలా? లేక మినహాయింపు తెచ్చుకోవాలా?
ఇది ఇపుడు ఏడుకొండల వాడికి ఎదురవుతున్న ఐహిక సమస్య.
తిరుపతి లడ్డుకు సమానమైన లడ్డు ఇప్పటికయితే భూమ్మీద లేదని నమ్మకం. రెండు కారణాల వల్ల ఈ లడ్డుకు లడ్డులలో అగ్రస్థానం లభించింది: ఒకటి, అది ప్రసాదం కావడం; రెండు, రుచి కూడా ప్రత్యేకంగా ఉండటం.
అయితే, ఈ లడ్డుకు ఒక చిక్కుసమస్య ఎదురయింది. ఈ లడ్డు ఆరోగ్యకరమయిందేనా అయితే,మరి దీనికి ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధారిటీ ఆప్ ఇండియా) వారి సర్టిఫికెట్ ఉందా?
బెంగుళూరుకు చెందిన టి సత్యనారాయణ మూర్తికి ఈ ప్రశ్నఎదురయింది. అతగాడు వెంటనే ఆర్ టి ఐ కింద ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ కి ఒక దరఖాస్తు పడేసి, తిరుపతి లడ్డుకు ఫుడ్ సెఫ్టీ , స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉందా, లడ్డుల తయారీలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చట్టం ప్రకారం నియమాలు పాటిస్తున్నారా అని అడిగారు.
ఈ చిన్న ప్రశ్నతో డొంక కదిలింది. వెంటనే ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ డైరెక్టర్ సునేతి తోతేజా ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ సెఫ్టీ అధికారులకు లేఖ రాస్తూ ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స యాక్ట్, 2016 ప్రకారం తిరుపతి లడ్డు ‘ఆహారం’ నిర్వచనం కిందకు వస్తుందా అని అడిగారు. ఇపుడు అది ఆహారం నిర్వచనం కిందకి వస్తుందో రాదో చూడాలి. వస్తే, రూల్స్ ఫాలోకావాల్సిందే.
ఈ మధ్య తిరుపతి లడ్డులలో మేకులు, బోల్టులు, గుట్కా పేపర్లు వస్తున్నట్లు వార్తలొస్తున్నాయని, అందువల్ల లడ్డులు ఆరోగ్యకరమయిన వాతావరణంలో తయారుకావడం లేదనిపిస్తూ ఉందని సత్యనారాయణ మూర్తి తన ఆర్ టిఐ దరఖాస్తులో అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, లడ్డులు కొనేవారికి టిటిడి బిల్లు కూడా ఇవ్వాలని మూర్తి అంటున్నారు. దీనితో పాటు లడ్డు కవర్ మీద మీద లడ్డు తయారీలో వాడిన పదార్థాల గురించిన సమాచారం, తయారుచేసిన తేదీ, తినేందుకు గడవు (ఎక్సపయిరీ తేదీ) కూడా ఉండాలని ఆయన అంటున్నారు.
ఈ దరఖాస్తు వచ్చాక ఫుడ్ సేఫ్టీ అధికారులు టిటిడితో సంప్రదింపులు మొదలుపెట్టారు. అంతే, లడ్లు తయారు చేసే లడ్డు శాల (పోటు)ను సందర్శించి తయారువుతన్న తీరును తనిఖీ చేయాలని కోరారు.
అయితే, టిటిడి దీనికి సుముఖంగా లేదని తెలిసింది. ఎందుకంటే పోటు పవిత్ర ప్రదేశం. అందువల్ల ఇతరుకు ప్రవేశం లేదని అధికారులకు సమాధానమిచ్చిందట.
ఇపుడు చట్టం ప్రకారం ఏమిజరుగుతుందో చూడాలి.
మెల్లిగా మెల్లిగా దేవుళ్లు కూడా ప్రజాస్వామ్య హక్కుల్ని గౌరవించాల్సిన పరిస్థితి వస్తావుంది. నియమాలు సడలించుకుని, ఇంతవరకు అనుమతి లేని మహిళలను, దళితులను ఆలయాల్లోకి అనుమతిస్తున్న సంఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఆలయాల్లో కూడా పౌరహక్కులు, ప్రజాస్వామిక హక్కులు పాటించాల్సిందే కోర్టులంటున్నాయి. నేపథ్యంలో ఏడుకొండలవాడు లడ్డు ప్రసాదం పవిత్రం అనే భావానికి తోడు, ప్రభుత్వం వారి సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో...
