అది డైమండ్ కాదు...రూబీ మాత్రమే : టిటిడి ఈవో

Tirumala jewels are safe - TTD EO Singhal
Highlights

సీఎం చంద్రబాబుతో ముగిసిన టిటిడి చైర్మన్, ఈవో ల భేటీ

తిరుమలలో శ్రీవారి ఆభరణాలు మాయం అయ్యాయని రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై టిటిడి స్పందించింది. ఇవాళ సీఎం చంద్రబాబును కలిసిన టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి ఉన్నతాధికారులు తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలను వివరించారు. పాలక మండలి తీసుకున్న పదవీ విరమణ నిర్ణయంతో పాటు రమణ దీక్షితులు చేసిన ఆభరణాల మాయమయ్యాయన్న ఆరోపణలపై కూడా సీఎం కు వివరించినట్లు సింఘాల్ తెలిపారు.

చంద్రబాబుతో బేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన టిటిడి ఈవో సింఘాల్... తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోవడం లేదని తెలిపారు. రమణ దీక్షితులు ఆరోపిస్తున్నట్లు గరుడసేవలో ఉపయోగించే పింక్‌ డైమండ్‌ మాయం కాలేదని వివరణ ఇచ్చారు. అసలు అది డైమండే కాదని, రూబీ అని,భక్తులు విసిరిన నాణేలే తగిలి పగిలిపోయిందని ఈవో తెలిపారు. ఆ ముక్కలు కూడా తమ వద్ద భద్రంగా ఉన్నాయని సింఘాల్ వివరణ ఇచ్చారు. భక్తులు విసిరిన నాణేలు తగిలే కెంపు పగిలిపోయిందని అప్పటి ఈవో ఐవైఆర్‌ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ గుర్తు చేశారు.
 
తిరుమలలో శ్రీవారికి అనాదిగా నిర్వహిస్తున్న ఆచారాల ప్రకారమే కైంకర్యాలు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ఆలయ పవిత్రతకు భంగం కల్గించనియ్యమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి తమకు తెలిపినట్లు ఈవో తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దన్నారని సింఘాల్ బీడియాకు వివరించారు.

ఇక టిటిడి పాలక మండలి తీసుకున్న పదవీ విరమణ అంశాన్ని కూడా సీఎం కు వివరించినట్లు సింఘాల్ తెలిపారు. ఈ విషయంలో నిబంధనలకు లోబడి, ఇతర అర్చకుల విన్నపాలను పరిగణలోకి తీసపుకుని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ అన్ని అంశాలపై చట్టపరంగా ముందుకెళ్తామని సింఘాల్ అన్నారు.  

 ఆలయంలో ఏదో ఒకచోట మరమ్మతులు జరుగుతూనే ఉంటాయని సింఘాల్ పేర్కొన్నారు. బూందీ పోటు దగ్గర ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. మరమ్మత్తుల్లో భాగంగా జరిగే తవ్వకాల గురించి కూడా ఇలా రచ్చ చేయడం తగదని ఈవో సింఘాల్ సూచించారు. 
 
 

loader