టిటిడి బోర్డు నియమకాల్లోకి అక్రమార్జన పరులు రాకుండా చేయడం సాధ్యమా ? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలా చేయగలరా?
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి సభ్యుడి పదవి దక్కాలంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కన్నా ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ముఖ్యం !
తితిదే పాలకమండలిలో నియామకాలన్నీ కూడా సిఫార్సుల తో జరిగినవేననే విషయం జగమెరిగిన సత్యం ! ప్రధాని మంత్రి సహా కేంద్రమంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సిఫార్సులు లేకుండా తితిదే పాలక మండలి సభ్యులు కావడం దాదాపు అసాధ్యం !
ఆంధ్రప్రదేశ్ సిఎం నిర్ణయం మేరకు ఈ జాబితాపై రాజముద్ర పడటం ఆనవాయితీగా వస్తోంది. తితిదే సభ్యుడికి ఉండవలసిన అర్హతలేమిటి ? ఎటువంటి నేపథ్యం ఉండాలి ? అనే విషయాలను పూర్తిగా పక్కకు పెట్టి పాలకమండలిని వ్యవస్థీకరిస్తున్న తీరు ఎన్నో ఏళ్లుగా భక్తులను కలవరపెట్టే అంశంగానే మిగిలిపోతుంది. భక్తుల ఇష్టాయిష్టాలతో కానీ మనోభావనలతో కానీ పాలకమండలికి పని లేదు.
రెండేళ్ల కోసారి ప్రభుత్వ నిర్ణయం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు కొలువు తీరుతుంటారు. ఇటీవల నల్లధనంతో పట్టుబడ్డ తమిళనాడుకు చెందిన కాంట్రాక్టరొకరు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు కూడా కావడంతో డొంక కదిలింది. ఇప్పుడు తితిదే పాలకమండలి సభ్యుల గత చరి్త్ర పైనే సర్వత్రా చర్చ....శేఖర్ రెడ్డి ఉదంతం తితిదేని కుదిపేసింది. దిద్దుబాటు చర్యలు చేపట్టినా విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఈ నిర్ణయాలన్నింటిలోను రాష్ర్ట ముఖ్యమంత్రిదే తుది నిర్ణయంగా ఉంటుంది. అందుకే.
ఇప్పుడు అందరి కళ్లు అమరావతిపై మళ్లాయి. నిజానికి .....తితిదే బోర్డు సభ్యుల నియామకానికి ఆధ్యాత్మికత, సామాజిక సేవలే ప్రామాణికం ! అత్యంత గౌరవప్రదమైన పాలకమండలిలో చోటు కల్పిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ..ఆచరణలో మాత్రం ఇది సాధ్యం కావడం లేదు. ఇటీవల శేఖర్ రెడ్డి ఉదంతంతో అభాసుపాలైన తితిదే పాలకమండలి ఇప్పుడు నష్టనివారణ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.
ఇందుకు గాను దీనికోసం దేవాదాయ శాఖ అధికారులతో పాటు తితిదే పాలకమండలి అధికారులు దేవాదాయ చట్టం ప్రతుల బూజు దులిపి, పాలకమండలి పునర్ వ్యవస్థీకరణకు పంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారట ! త్వరలోనే ఒక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి కి సమర్పించే అవకాశం ఉంది. ` ఎవరో చెబితే ఇచ్చాం,` అని జవాబు కోసం తడుముకునేందుకు తావు లేకుండా చట్టంలో పాలకమండలి సభ్యుల నియామకాలను భవిష్యత్తులో ఏ విధంగా చేపట్టాలనే విషయాలను కూడా అధికారులు నివేదించనున్నారు.
జరిగిన తప్పును దిద్దుకునే చిన్నప్రయత్నమట ! ఆదాయపు పన్ను సోదాలలో భారీ ఎత్తున నగదు, బంగారం నిల్వలతో పట్టుబడిన శేఖర్ రెడ్డిని తితిదే సభ్యుడి పదవి నుంచి తొలగించారు. ప్రస్తుతం తితిదే పాలకమండలి పునర్ వ్యవస్థీకరణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.
ప్రస్తుత పాలకమండలి సభ్యులలో కొందరి చరిత్రను తిరగదోడగలరా ? పభ్యుల నేపథ్యం కానీ వారి పూర్వాపరాలను కానీ తెలుసుకోకుండా పదవులను కట్టబెట్టి ఇప్పుడు నాలుక కరుచుకుంటే ఫలితం శూన్యం అనే విమర్శలు సైతం వినవస్తున్నాయి.సదరు సభ్యులకు భక్తి భావన, సామాజిక సేవ తత్పరత...వంటి అంశాలపై ఎటువంటి పరిశీలన కాని లేకుండా బోర్డు సభ్యలుగా నియమించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నదృష్ట్యా భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారట !
శేఖర్ రెడ్డి చెన్నయ్ నివాసంతో పాటు అతడి కార్యాలయాలలో భారీ ఎత్తున నల్లధనం లభ్యం కావడంతో రాష్ర్ట ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 సెక్షన్ 96 ప్రకారం . తితిదే పాలకమండలి సభ్యుడిని తొలగించాలంటే చట్టంలోని కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి్. లేనిపక్షంలో తనను అన్యాయంగా తొలగించారంటూ సదరు సభ్యుడు న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉంది.
శేఖర్ రెడ్డి తొలగింపుపై దేవాదాయ చట్టంలోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో నియామకాలు ఎలా ఉండాలి అనే అంశంపై కూడా చట్ట సవరణలకు ఆస్కారం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
