23 సంవ‌త్స‌రాలు పాటు ఏ పాస్‌పోర్ట్‌, ఎలాంటి వీసా లేకుండా సౌదీ అరేబియాలో గ‌డిపాడీ వ్య‌క్తి .ఒక్కసారి కూడా ఇంటికి వెళ్ల లేకపోయాడు. కార‌ణం? అత‌ను త‌న వెంట తీసుకెళ్లిన ప‌త్రాల‌న్నీ న‌కిలీవి కావ‌డ‌మే.ఆరునెల‌ల పాటు అక్క‌డ రైతు కూలీగా ప‌నిచేసిన త‌రువాత అత‌ణ్ణి ఎడారి గ్రామానికి కూలిగా పంపించారు. అక్క‌డి నుంచి ఇక బ‌య‌టి ప్ర‌పంచానికి రాలేక‌పోయాడు. ఇపుడు తొలిసారి బయటకు వస్తున్నాడు,విముక్తి పొందుతూ...
జీవనోపాధిని వెదుక్కుంటూ ఎడారి దేశం సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులు అక్కడ ఎదుర్కొనే కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఇన్నీ కావు. అయినప్పటికీ.. తమ వారి మేలు కోసం, తన కుటుంబం సంతోషంతో ఉండటం కోసం ఎన్ని కష్టాలనైనా భరిస్తుంటారు. గల్ఫ్ దేశాల్లో.. ప్రత్యేకించి- సౌదీ అరేబియాలో చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఏ మాత్రం తప్పు చేసినా.. కఠిన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
23 సంవత్సరాలు పాటు ఏ పాస్పోర్ట్, ఎలాంటి వీసా లేకుండా సౌదీ అరేబియాలో గడిపాడో వ్యక్తి. అతని పేరు గణ ప్రకాశన్ రాజమరియన్. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన రాజమరియన్ది నిరుపేద కుటుంబం. అతనికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు. వారిని పెంచి పోషించడానికి అవసరమైన డబ్బును కూడబెట్టుకుందామన్న ఆశతో 1994లో సౌదీ అరేబియాకు వెళ్లాడు.
అంతే- అప్పటి నుంచి వెనక్కి రాలేదు. ఒక్కసారి కూడా ఇంటికి వెళ్ల లేకపోయాడు. కారణం? అతను తన వెంట తీసుకెళ్లిన పత్రాలన్నీ నకిలీవి కావడమే. రాజమరియన్ కన్నీటి గాధను `సౌదీ గెజిట్` అనే స్థానిక మీడియా ప్రచురించింది. 1994 ఆగస్టులో సౌదీ అరేబియాకు చేరుకున్న రాజమరియన్ అక్కడి హెయిల్ ప్రావిన్స్లోని ఓ మారుమూల గ్రామంలో రైతు కూలీగా చేరాడు. మొదట్లో అతనికి వంద సౌదీ రియాద్లను వేతనంగా ఇచ్చారు.
ఆరునెలల పాటు అక్కడ రైతు కూలీగా పనిచేసిన తరువాత అతణ్ణి ఎడారి గ్రామానికి కూలిగా పంపించారు. అక్కడి నుంచి ఇక బయటి ప్రపంచానికి రాలేకపోయాడు రాజమరనియన్. 23 సంవత్సరాల పాటు ఎడారికి ఆనుకుని ఉన్న ఓ గ్రామంలో కూలీగా కాలం వెల్లదీశాడు. అల్ నుఫుద్ అల్ కబిర్ ఎడారి ప్రాంతంలో గడిపాడు. రాజమరియన్తో పాటు మరో ఇద్దరు పనిచేసే వారు.
వారికి సకాలంలో వేతనాలు అందేవి కావు. అసలు తమను మనుషులుగా కూడా చూడలేదని రాజమరియన్ వాపోయినట్లు సౌదీ గెజిట్ పేర్కొంది. ఓ మనిషి జీవిత కాలంలో 23 సంవత్సరాలు అంటే మాటలు కావు. దాదాపు సగం జీవితమంతా ఎడారి గ్రామంలోనే గడిపాడు రాజమరియన్. 2015లో చివరి సారిగా అతను తన కుటుంబంతో ఫోన్లో మాట్లాడాడు.
అప్పటికే ఆయన భార్య రోణిక్యం ఆసుపత్రిలో ఉందని తెలిసింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె చనిపోయినట్లు రాజమరియన్కు తెలిసింది. రాజమరియన్తో పాటు మరో ఇద్దరి దారుణ పరిస్థితి గురించి తెలుసుకున్న సర్ఫుద్దిన్ తయ్యిల్ అనే సామాజిక కార్యకర్త వారిని స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు, అధికారిక డాక్యుమెంట్లు లేకుండా తమ దేశంలో గడుపుతున్న వారిని స్వదేశానికి పంపించడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం 90 రోజుల పాటు గడువు ఇచ్చింది.
`ఆమ్నెస్టీ పీరియడ్` అంటారు దీన్ని. సౌదీ అరేబియా ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసలుబాటును సర్ఫుద్దిన్ తయ్యిల్ ఈ ముగ్గురికీ వివరించారు. వారిలో రాజమరియన్ ఒకరు. 90 రోజుల ఆమ్నెస్టీ గడువును ఉపయోగించుకుని వందలాది మంది భారతీయులు స్వదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసర ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ 26, 713 మంది భారతీయులు జెడ్డాలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి దరఖాస్తులు దాఖలు చేశారు.
వారిలో అత్యధికంగా ఉత్తర్ప్రదేశ్ నుంచి 11,390 మంది ఉన్నారు. రెండో స్థానంలో మన తెలంగాణ ఉంది. తెలంగాణ నుంచి 2733, పశ్చిమ బెంగాల్ నుంచి 2332, తమిళనాడు నుంచి 2022, కేరళ నుంచి 1736, బిహార్ నుంచి 1491, ఏపీ నుంచి 1120, రాజస్థాన్ నుంచి 853 మంది దరఖాస్తులు దాఖలు చేసుకున్నట్లు కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది.
( గల్ఫ్ ప్రవాసి మిత్ర నుంచి)
