దీపావళికి అసలు టపాసులు ఎందుకు కాలుస్తారు? ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే.. రాముడు.. రవాణాసురుడిని చంపాడని, సత్యభామ నరకాసురుడిని అంతమొందించిందని అందుకే టపాసులు కాలుస్తుంటారని పెద్దవాళ్లు చెబుతుంటారు. అయితే.. ఇందులో అసలు నిజం లేదు. ఎందుకంటే.. 1923కి ముందు మన దేశంలో అసలు టపాసులే లేవు. ఆ రోజుల్లో దీపావళి అంటే కేవలం దీపాలను వెలిగించే వారు. మరి టపాసులు ఎప్పటి నుంచి కాల్చడం మొదలుపెట్టారు? వాటిని మనకు పరిచయం చేసింది ఎవరూ అంటే మాత్రం నాడర్ బ్రదర్స్. అసలు ఏవరీ నాడర్ బ్రదర్స్? ఏమిటా కథ? ఇప్పుడు తెలుసుకుందాం..

దీపావళి అనగానే అందరికీ టపాసులు ఎలా గుర్తుకు వస్తాయో.. టపాసులు అనగానే శివకాశీ బాంబులు గుర్తుకు రావడం సహజం. ఈ శివకాశీ.. తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ప్రస్తుతం మనదేశంలో ఎక్కడికైనా టపాసులుఈ పట్టణం నుంచే సరఫరా చేస్తారు. శివకాశీలో టపాసుల తయారీ మొదలు పెట్టిన తర్వాతే.. బాణా సంచా కాల్చడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా దీపావళి రోజు టపాసులు కాలుస్తున్నారు.

ఎవరీ నాడర్ బ్రదర్స్?

మన దేశంలో మొట్టమొదటి బాణాసంచా కర్మాగారం కోల్ కత్తాలో ప్రారంభమైంది. శివకాశీ పట్టణానికి చెందిన  పి.అయ్యన్ నాడర్, షణ్ముగ నాడర్ అనే ఇద్దరు అన్నదమ్ములు కలకత్తా వెళ్లి అక్కడ టపాసుల తయారీ కేంద్రంలో పనిచేశారు. అక్కడ వారు మొదట అగ్గిపెట్టెలు తయారు చేయడం నేర్చుకున్నారు. తర్వాత బాణాసంచా తయారీలో మెలకువలు నేర్చుకుని శివకాశికి తిరిగి వచ్చి 1923లో అగ్గిపెట్టెల పరిశ్రమ ప్రారంభించారు.

తరువాత ఎనిమిది నెలలకు జర్మనీ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుని అనిల్ బ్రాండ్, అయ్యన్ బ్రాండ్ పేరుతో బాణాసంచా ఉత్పత్తిని ప్రారంభించారు. కాలక్రమానా కోల్ కత్తాలోని టపాసుల కేంద్రం శివకాశీకి తరలించారు. 1940లో ప్రేలుడు పదార్థాల చట్టం ఏర్పాటై బాణాసంచా కర్మాగారాల లైసెన్సింగ్ విధానం, బాణాసంచా నిలువ, అమ్మకాలపై నియంత్రణ మొదలయ్యింది.   శివకాశీలో 8వేలకు  పైగా బాణాసంచా ఉత్పత్తి చేసే పరిశ్రమలున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే బాణాసంచాలో 90 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంటాయి.

ప్రతి సంవత్సరం కనీసం రూ.వెయ్యి కోట్ల బాణాసంచా వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. అది కూడా కేవలం దీపావళి సమయంలోనే కావడం విశేషం. ప్రస్తుత రోజుల్లో దీపావళి పండగ సమయంలోనే కాకుండా వివాహాలు, ఫంక్షన్లు, ఎన్నికల సమయంలో కూడా టపాసులు కాలుస్తున్నారు. దీంతో సంవత్సరం పొడవునా ఇక్కడ టపాసుల కొనుగోళ్లు జరుగుతుంటాయి. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా టపాసులు తయారు చేసేది భారత్ లోనే. అందులోనూ శివకాశీ పట్టణంలోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుంటాయి.

అంతలా టపాసుల తయారీని అభివృద్ధి చేశారు.. ఈ నాడర్ బ్రదర్స్. అయ్యన్ నాడర్ మరణం తర్వాత ఆ వ్యాపార బాధ్యతను వారి కుమారులు స్వీకరించారు. 1984 నుంచి గ్రహ దురై, వైర ప్రకాశంలు ఈ శివకాశీ టపాసుల తయారీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ శివకాశీ బాధ్యతను నాడర్ మూడోతరం నిర్వహిస్తోంది.గ్రహ దురై కుమారుడు అబిరుబెన్ ప్రస్తుతం దీని నిర్వహణ చూస్తున్నారు. క్వాలిటీ ప్రధాన లక్ష్యంగా ఈ అయ్యన్ క్రాకర్స్.. ముందుకు దూసుకుపోతున్నాయి.