Asianet News TeluguAsianet News Telugu

పొలిటికల్ ఖేల్ ఖతం, దుకణం బంద్

‘విషయం వీగ్గా ఉన్నప్పుడే ప్రచారం పీగ్గా ఉంటుంది’ అని ఓ కామెడీ స్కిట్టుల రచయిత ఎందుకన్నాడో తెలియదు కానీ, వాస్తవంలో కూడా ఇది నిజమనిపిస్తోంది. కొన్నిసార్లు పాలకులు తమ పాపాలను చెరిపేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తుంటారు. తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని సందర్భాలలో కరడు కట్టిన క్రిమినల్స్ కార్యకలాపాలకూ క్లీన్ చిట్‌లు ఇస్తుంటారు.

This is how a crime suspense thriller given a quite burial in Telangana

‘విషయం వీగ్గా ఉన్నప్పుడే ప్రచారం పీగ్గా ఉంటుంది’ అని ఓ కామెడీ స్కిట్టుల రచయిత ఎందుకన్నాడో తెలియదు కానీ, వాస్తవంలో కూడా ఇది నిజమనిపిస్తోంది. కొన్నిసార్లు పాలకులు తమ పాపాలను చెరిపేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తుంటారు. తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని సందర్భాలలో కరడు కట్టిన క్రిమినల్స్ కార్యకలాపాలకూ క్లీన్ చిట్‌లు ఇస్తుంటారు.

గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ కేసులో చివరికి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కాక, యావత్ దేశానికే తెలిసొచ్చిన నీతి బహుశా ఇదేనేమో? నయీమ్ కేసులో అక్రమార్కులైన ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు, మీడియా మిత్రులూ వెలుగులోకి వస్తారనుకుంటే అసలు ఆ కేసునే వీక్ చేసేసి పారేశారు కొంత మంది పెద్దలు. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వినవస్తున్న తాజా వార్త.

ఎలాగూ నయీం విషయంలో కేసీయార్ ప్రభుత్వం రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకూ క్లీన్ చిట్ ఇచ్చేసింది కదా? ఇక, నయీంతో చెట్టపట్టాలేసుకుని, నయీంను వాడుకుని కోట్లకుకోట్లు కొల్లగొట్టిన మీడియా మిత్రులకు కూడా ఉపశమనం లభించినట్లే. ఖద్దర్లు, ఖాకీలు శుద్ధపూసలే అని తెలంగాణ ప్రభుత్వం ఏకంగా హైకోర్టుకే నివేదిక ఇచ్చింది కదా? ఇంకేం? నయీం నీడలన్నీ బలం పెంచుకుంటున్నాయి. ఇక, ఎక్కడెక్కడో అజ్ఞాతంలో ఉండిపోయినవారూ బలం కూడదీసుకుంటున్నారు. నయీంకు వెనకా ముందూ బలాలుగా నిలబడిన వాళ్లు తిరిగి కొత్త నయీంలుగా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నయీంపై ఫిర్యాదులు చేసిన బాధితుల్లో మళ్లీ వణుకు మొదలైంది.

ఈసారి సర్కారుపై వాళ్లకు ఏమాత్రం భరోసా లేదన్నది అర్ధమవుతోంది. మొన్నటికిమొన్న హైకోర్టుకు తెలంగాణ హోం మంత్రిత్వ శాఖ సమర్పించిన అఫిడవిట్ తెలంగాణ జనాన్ని షాక్‌లో ముంచేసిందనే చెప్పాలి. ఇది కొత్త సంవత్సరం వేళ తిరుమల గుడి బయట కనిపించిన దృశ్యాన్ని చూస్తే నయీం కేసుల్లో ముఖ్యనిందితుల్లో ఒకడైన చింతల వెంకటేశ్వరరెడ్డి, తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌రావుతో కలిసి ఎలా కులాసాగా ఉన్నారో అర్థం కావట్లేదా? ఇలాంటి ఫొటోలు బయటకు వచ్చాక కూడా కేసీఆర్ లాంటి ప్రభుత్వ పెద్దలు తన పార్టీ పరువు తీసుకునే పని చేస్తారా?

*నయీం ఎన్‌కౌంటర్ కాగానే

 కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిన వెంకటేశ్వరరెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఓ ఎఫ్ఐఆర్‌లో నేతి విద్యాసాగర్‌రావు పేరు కూడా ఉంది. అసలు నయీం వార్తలు హోరెత్తుతున్న కాలంలో ఇక రేపో మాపో మండలి డిప్యూటీ ఛైర్మన్ పోస్టుకు రాజీనామా చేయాలని కేసీయార్ ఆదేశించబోతున్నారనీ, చర్యలు తప్పవూ అన్నట్టు వార్తలొచ్చాయి. ‘నా పార్టీకి చెందిన నాయకుడిపైనే చర్య తీసుకున్నానూ చూశారా’ అని చెప్పి నయీం కేసులతో లింకులున్న ఇతర నేతలపై కేసీయార్ కొరడా పట్టుకోబోతున్నాడనీ పుంఖానుపుంఖాలుగా రాశారు నయీమ్‌తో సంబంధాలు లేని మీడియా లెజండ్లంతా.

 

 

*తీరా చూస్తే ఇదుగో, ఇవీ కథలు

 అవే నయీం నీడలు, కేసీయార్ సహా ఎవరూ ఏమీ చేయలేని జాడలు. ఇంతకీ వీళ్లు తిరుమలలో ఎలా కనిపించారంటే? మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా చింతలకు వీఐపీ దర్శనం సిఫారసు చేశాడు విద్యాసాగర్రావు. అంతేకాదు, స్పెషల్ బ్రేక్ దర్శనాలకు సిఫార్సులు చేసే వీఐపీలు తప్పకుండా ఆ అతిథుల వెంట ఉండాలని ఈసారి టీటీడీ స్ట్రిక్ట్ చేయడంతో, ఇక తప్పనిసరై నేతి తను దగ్గరుండి మరీ చింతలకు ప్రత్యేక దర్శనం చేయించారు. ఇది ఎవరో ఒక్కరూ ఇద్దరు కలిసి కనిపించిన ఓ దృశ్యానికి సంబంధించిన ఆందోళన కాదు.

ఎప్పుడైతే నయీం విషయంలో కేసీయార్ ప్రభుత్వం అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసిందో, ఇక కేసులు ఎదుర్కునేది చిన్నాచితకా ఆకు రౌడీలు మాత్రమేనేమో? పెద్ద పెద్ద తలకాయలన్నీ మళ్లీ బోరవిరుచుకుని, పాత బలాలు కూడగట్టుకుని కొత్త ముఠాలకు ప్రాణప్రతిష్ట చేస్తారనే భయం, గతంలో నయీం ఏలిన సమాంతర రాజ్యమంతటా వ్యాపిస్తున్నది. బాధితులు నష్టపోయినవి తిరిగి ఇప్పిస్తానన్న కేసీయార్ మాట, హామీ ఉత్తదేనని తేలిపోయింది. మొత్తం తెలంగాణ ప్రజలకే కాదు, తనను గుడ్డిగా భజించే అభిమానులకు సైతం కేసీయార్ ఊహించలేని, సమర్థించుకోలేని, నమ్మలేని షాక్ ఇచ్చారు.

దటీజ్ కేసీయార్. తను ఒక విషయాన్ని పదే పదే గట్టిగా చెబుతున్నాడూ అంటే తెరవెనుక దానికి పూర్తి భిన్నమైన కార్యాచరణ ఉంటుందని లెక్క. అధికారంలోకి వచ్చాక అయ్యప్ప సొసైటీ కబ్జాల నుంచి స్టార్ట్ చేసి లెక్కిస్తే, తాజాగా నయీం కేసు వరకూ మొత్తం ఇలాంటివే, వోటుకునోటు కేసు వాటిల్లో ప్రధానమైంది కాగా, ఘోరంగా, దారుణంగా ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెట్టింది మాత్రం నయీం కేసులోనే! మొన్నటికిమొన్న అసెంబ్లీలో, మండలిలో చర్చ జరిగినప్పుడు తనే స్వయంగా ఏమన్నారు? నయీం కేసులో ఎవరినీ వదిలేదు లేదు, ఎంతటి పెద్దవాళ్లున్నా వదిలిపెట్టను అని గర్జించారా లేదా? నయీంకు నాయకులతో, అధికారులతో ఉన్న సంబంధాలు చర్చకు వచ్చాయా లేదా? తీరా ఏమైంది? నమ్మశక్యం కాని వైఖరిని ఏకంగా హైకోర్టులోనే ప్రదర్శించింది.

‘ఇంకెక్కడి నయీం కేసు, కేస్ ఖతం, దుకాణం బంద్’

అనే సంకేతాల్ని జనంలోకి వదిలేసింది. ఒక్కసారి ఈ కేసులో రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడివట్ ముఖ్యాంశాలు అందరినీ విస్తుపోయేలా చేస్తాయి. ‘‘నయీంతో నేతలు, పోలీసులకు సంబంధాల్లేవు. నాయకులు, అధికారులు గ్యాంగ్‌స్టర్‌ను వాడుకోలేదు. అతని నుంచి ప్రయోజనాలూ పొందలేదు. దీనిపై ఇప్పటిదాకా ఆధారాలు దొరకలేదు. హైకోర్టుకు తెలంగాణ సర్కారు నివేదన. పిటిషనర్‌ ఆరోపణలన్నీ సత్యదూరం. పోలీసులను, నాయకులను సిట్‌. కాపాడుతోందనడమూ సరికాదు. సోహ్రాబుద్దీన్‌ కేసులో సీబీఐ వెతుకుతోందనడానికీ ఆధారాల్లేవు. ప్రభుత్వం నయీంకు రూ.25 లక్షలు ఇచ్చిందని చెప్పడం అబద్ధం. నక్సల్‌ సంస్థలతో నయీంకు సంబంధం ఉందనడానికీ ఆధారాల్లేవు.

*4 సిట్‌ బృందాలు దర్యాప్తు

 చేస్తున్నాయి, 175 కేసులు, 116 మంది అరెస్టు, ఇన్నేళ్లుగా నయీంను ఓ ఆయుధంగా వాడుకుని, తెలంగాణ సమాజాన్ని అనేకరకాలుగా హింసించిన ఖద్దరు పెద్దలు, ఖాకీ పెద్దలందరికీ ఈ దెబ్బకు ‘క్లీన్ చిట్’ వచ్చేసినట్టే! వేలాదిమందిని వేధించి, హింసించి, వేల కోట్లు పోగేసుకున్న నయీం అనే ఓ ‘అధికారిక మాఫియా’ మూలాలను, రోగకారణాల్ని ప్రభుత్వం ఇక పూర్తిగా వదిలేసినట్టే. దాదాపు రెండు నెలలపాటు అనేక లీకు వార్తలు రాయించారు. రేపోమాపో ఫలానా టీఆర్ఎస్ నేతల అరెస్టు, పదవులకు రాజీనామాలు చేయాలని చెప్పిన కేసీయార్, నయీంతో దోస్తీ చేసిన పోలీసు ఉన్నతాధికారుల జాబితా రెడీ, డైరీలో అన్ని జాతకాలు, సీడీలు తీసిపెట్టిన నయీం, డంపుల్లో వందల కోట్లు, ప్రత్యేక కోర్టు ఆలోచన, బాధితులందరికీ న్యాయం.

*తుస్. డంపుల్లో డబ్బంతా మాయం

 అదంతా ఎవరి నేలమాలిగలోకి చేరిందో? మొత్తం నయీం చీకటి కథలన్నింటికీ ఇక మంగళం. అందరూ దొంగలే. గుప్ చుప్ సాంబారు బుడ్డీ. రాబోయే కాలంలో ఏ పదేండ్లకో, నయీం ప్రస్తావన వస్తే. ‘‘పాపం, చిన్న చిన్న జేబుదొంగతనాలు, చెయిన్ స్నాచింగులు చేసుకుంటూ పొట్టపోసుకునేవాడు అతను, అంతే, కానీ ప్రజలే నయీం గురించి అనేక కథలు చెప్పుకునేవారు. మనిషి నాలుక్కి నరం ఉండదు కదా? ష్, అవన్నీ ఉత్తవే ప్రచారాలు’’ అని చెప్పే దశ వైపు పయనించడమే కదా ఇది. శెభాష్. అన్నట్టు ఆ నయీం డైరీలో ఏముందో తెలుసా? ‘‘అబ్బే, ఏమీ లేదు, రోజూ తన ఇంటి వద్ద పేదలకు చేసే అన్నదానాలు, పేదలకు పెళ్లిళ్లు, వాటి కర్చులు, పదీఇరవై రూపాయల చందాలు, సర్వమత ప్రార్థనల వివరాలు రాసుకునేవాడు, అంతే’’ అని రేప్పొద్దున ఎవరైనా చెబితే ఆశ్చర్యపోకండి, కిందపడి కొట్టుకోకండి.

 

(ఎవర్రాశారో తెలియదు.సోషల్ మీడియాలో గిరగిర తిరుగుతూ ఉంది. ఆలోచింప చేసే పచ్చి నిజాలు ఇందులో ఉన్నాయి. కాలమేదయినా,దేశమేదయినా, రాజకీయాలలో క్రెం సస్పెన్స్ ధ్రిల్లర్స్ ఒక లాగే ముగింపు కొస్తాయి. నయీం కథ అంతే)

Follow Us:
Download App:
  • android
  • ios