ఇపుడు కశింకోట ఒక గ్రామము, కాకపోతే, మండలం... అని తీసిపడేయవద్దు. కశింకోటలో తవ్వే కొద్ది చరిత్రే... అంటున్నారు చరిత్ర పరిశోధకుడు జయంతి చంద్రశేఖర్.
ఇపుడు కశింకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామము, కాకపోతే, మండలం. శారదానది ఒడ్డున, మద్రాసు - కలకత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్డు పైన ఉంది. గాని ఈ గ్రామానికి ఔరా అనిపించేంత చరిత్ర ఉంది. ఇలాంటివి సాధారణంగా ఎవరూ చెప్పరు. పెద్దగా గ్రంథస్థం కావు. ఈ కశింకోట గత వైభవం గురించి చరిత్ర పరిశోధకుడు జయంతి చంద్రశేఖర్ చెబుతున్న విశేషాలివి

కశింకోట సంస్థానపు గ్రామము. నిజాం పాలనలో చికాకోల్ సర్కారులో ఒక ఫౌజ్‌దారీగా ఉండేది. ఆ తరువాత 1794 నుండి 1802 వరకు విశాఖపట్నం జిల్లాగా ఏర్పడిన మూడు కలెక్టరేట్లలో ఒక కలెక్టరేటుకు ముఖ్యపట్టణంగా ఉంది. 1802లో విశాఖపట్నం జిల్లా ఏర్పడిన తర్వాత అనకాపల్లి జమిందారీ తాలూకాలో భాగమైనది. మహమ్మదీయుల పాలనలో గోదావరి నదికి ఉత్తారన ఉన్న ప్రాంతంలోని కోటలలోకెల్లా పటిష్టమైన ప్రముఖ కోటగా పేరుపొందింది. అయితే ప్రస్తుతం కశింకోటలో కోట వైభవం చెప్పే శిథిలాలు మాత్రమే మిగిలాయి. 1882లో రాబర్ట్ సీవెల్ కశింకోట దుర్గం 800 యేళ్ళనాటిదని ప్రస్తావించాడు. అంటే ఈ కోట కనీసం 11వ శతాబ్దం నుండి ఉండి ఉండాలి. ఇక్కడ సదాశివరాయల కాలం నాటి రెండు శాసనాలు (1558, 1559) లభించాయి. 1572లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఉత్తరాంధ్రలో తన ప్రాబ్యలం పెంచుకోవటానికి రాజమండ్రి నుండి దండెత్తి కశింకోటను వశపరచుకున్నాడు. ఆ తరువాత ఒరిస్సాపై దండెత్తాడు. నామమాత్రంగా గంజాం మెత్తం గోల్కొండ సుల్తానుల ఆధీనంలో ఉన్నాపాలించింది మాత్రం బాహుబలేంద్ర కుటుంబం. ఆ తరువాత వాళ్లు రాజధానిని రాజమండ్రి నుండి కశింకోటకు మార్చారు. బాహుబలేంద్ర కుమారుడు ముకుందరాజు కశింకోట రాజుగా ఉన్న కాలంలో పన్నులు కట్టడానికి నిరాకరించాడు. కుతుబ్‌షా దండెత్తి రాగా, వేంకటాపతి రాయలును సహాయం కోరాడు.
కశింకోట సంస్థానం
కశింకోట సంస్థానాన్ని చెలికాని కుటుంబం పాలించింది. వీరు రావు గారికి బంధువులు. హవేలీ భూములతో ఏర్పడిన కశింకోట, మేలుపాక సంస్థానాలను వేలంలో విజయనగరం రాజు కొన్నారు. రెండు సంవత్సరాల తర్వాత వాటిని కారుమంచి వెంకటాచలానికి అమ్మారు. 1837లో ఆయన మరణించిన తర్వాత మనవడు(కూతురు కొడుకు) మంత్రిప్రగడ వెంకటరావుకు సిద్ధించాయి. 1845లో ఆయన కూడా మరణించగా, వెంకటరావు తమ్ముడు చిరంజీవిరావు, కొడుకు వెంకటాచలానికి ఉమ్మడిగా కట్టబెట్టారు. ఇద్దరూ పిల్లలైనందువళ్ళ సంస్థానం సంరక్షక పాలనలో ఉంది. తమ్ముడు చిరంజీవిరావు 1851లో మరణించారు, కొడుకు వెంకటాచలం 1863లో యుక్తవయసులోనే 1865 మే నెలలో మరణించారు. ఆయన మైనరు విధవ రామాయమ్మ, పసిపాప మహాలక్ష్మమ్మ.
ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో కశింకోట గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము: ‘‘14 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 7 కోసులదూరములో నుండే కసంకోట అనేవూరు 9 గంటలకు చేరినాను. దారిలో అనకాపల్లి హనే మజిలీవూరు వున్నది. పోలీసు అమీనున్ను40 యిండ్ల బ్రాహ్మణాగ్రహారమున్ను కలది. దారి నిన్నటివలెనే భయోత్పదములయిన మన్యాలు యిరుపక్కలా కలిగివున్నవి. కనంకోట యనే వూరు గొప్పదేను. అన్నిపదార్ధాలు దొరికేపాటి అంగళ్ళు కలవు. బ్రాహ్మణ యిండ్లలో వంట, భోజనము కాచేసుకుని వొక గంటకు బయిలుదేరి యిక్కడికి యేడుకోసులదూరములో నుండే యలమంచిలి యనే వూరు 7 గంటలకు చెరినాను.’’
(*జయంతి చంద్రశేఖర్ చరిత్ర పరిశోధకుడు. ఆయన ఏన్సియంట్ వైజాగ్ పట్నం నుంచి సేకరించింది.)
