ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్.. మరే ఫోన్ కీ లేదని చెప్పొచ్చు. యాపిల్ నుంచి కొత్త ఫోన్ ఎప్పుడెప్పుడు విడుదలౌతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి ఐఫోన్లకు ఇప్పుడు పెద్ద ముప్పు వచ్చిపడింది. ఏమిటా ఉప్పు అనుకుంటున్నారా..? కేవలం ఒకే ఒక్క తెలుగు అక్షరం ఇప్పుడు ఐఫోన్ లను క్రాష్ చేస్తోంది.

యాపిల్ చరిత్రలోనే ఓ తెలుగు అక్షరం ఐపోన్  క్రాషింగ్‌కి కారణం అవడం ఇది తొలిసారి.  ‘జ్ఞా’ అనే తెలుగు అక్షరాన్ని ఐఫోన్ వినియోగదారులకు ఫేస్ బుక్, మసేంజర్, ఎస్ఎంఎస్ రూపంలో ఎలా పంపినా.. ఆ ఫోన్ క్రాష్ అయిపోతోంది.  ఇటలీకి చెందిన మొబైల్‌ వరల్డ్‌ అనే ఓ బ్లాగ్‌ దీన్ని గుర్తించింది. ‘టెక్ట్స్‌ బాంబ్‌’గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఆ తర్వాత పలువురు దీనిని ప్రయత్నించి నిజమేనని సామాజిక మాధ్యమాల వేదికగా తమకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

 ‘మీకు ఈ మెస్సేజ్‌ వస్తే దాన్ని ఓపెన్‌ చేయకండి. ఇది ఐవోఎస్‌ కొత్త బగ్‌. భారతీయ భాషకు సంబంధించిన అక్షరం ఐఫోన్‌లోని యాప్స్‌ను లేదా ఏకంగా ఫోన్‌నే క్రాష్‌ చేస్తోంది. వాట్సాప్‌ సహా అన్ని మెస్సేజింగ్‌ యాప్‌లను ఇది డిసేబుల్‌ చేస్తోంది’ అని ఓ వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. ఒకవేళ ఈ అక్షరం నోటిఫికేషన్‌గా వస్తే దాన్ని డిలీట్‌ చేయాల్సిందిగా పలువురు టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఐవోఎస్‌ 11లో ఉన్న బగ్‌గా దీనిని గుర్తించి యాపిల్‌కు నివేదిక ఇచ్చారు. దీనిని పరిష్కరించే పనిలో యాపిల్ ప్రస్తుతం బిజీగా ఉంది.