Asianet News TeluguAsianet News Telugu

రైల్వేవారి పుణ్యం: కల్యాణదుర్గం ఇలా కల్యాణదుర్గ అయింది

అనంతపురం జిల్లా ‘కల్యాణదుర్గం’ స్టేషన్ పేరును రైల్వే వారు ‘కల్యాణదుర్గ’ గా మార్చారు.  కొండమీద ఉన్న కోట్ల వల్ల ఈ పేరు వచ్చింది. అయితే,పేరు కల్యాణదుర్గగా మార్చినందున ఎన్ని అనర్థాలున్నాయో శ్రీనివాస కృష్ణ వివరిస్తున్నారు. సరదాగా కాదు, సీరియస్ గానే.

thanks to Railways now one can write a new history of kalyanaduram

చరిత్రను సృష్టించడం ఎలా? ఇదుగో ఇలా!

ఇదుగో - క్రొత్తగా ప్రారంభమై భవిష్యత్తులో క్రొత్త చరిత్ర నృష్టికి మూలం కాబోతున్న మా కల్యాణదుర్గం రైల్వే స్టేషను. ఇదే నేనుపనిచేస్తున్న  తిరుపతినుండి మా కల్యాణదుర్గానికి నేరుగా వచ్చే రైలు.

దూరంగా అక్కమ్మగార్ల కొండ.

అంతా బాగానే ఉంది కాని, స్టేషను పేరు చక్కగా తెలుగులో కల్యాణదుర్గం అని వ్రాయకుండా హిందీవాసన ఉట్టి పడేలా ఆ స్టేషను బోర్డుపై "కల్యాణదుర్గ" "Kalyanadurga" "कल्याणदुर्गा" అని వ్రాయడమే క్రొత్త చరిత్రసృష్టికి శ్రీకారం చుట్టడమనిపిస్తున్నది.(కళ్యాణం అని కూడా రాశారు. ఇది వేరే విషయం)

రైల్వే టైంటేబుల్లో ఈ పేరు చూసి చూసి చివరకు అందరూ అసలు ఈ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా మరచిపోతారేమో. ఇక్కడ కొండమీద ఒక కోట ఉందని, అదే కల్యాణదుర్గమని భవిష్యత్తులో ఎవడైనా చెబితే నవ్వేవాళ్లు తయారు కావచ్చు.

 

ఎవడో పక్కా భక్తి వ్యాపారస్థుడు దుర్గమ్మ గుడి ఒకటి ఈ స్టేషన్ చుట్టుపక్కల కట్టించి ఈవిడే కల్యాణదుర్గమ్మ, ఈవిడని కొలిచినందువల్లే రుక్మిణి తాను కోరుకున్న కృష్ణుని కల్యాణం చేసుకోగలిగిందని, ఓ స్థలపురాణం సృష్టించి ఈ దుర్గమ్మ కొలువై ఉండడం వల్లనే ఈ ఊరికి కల్యాణదుర్గ అనే పేరు వచ్చిందని "అమాయిక"ప్రవచనకారులచేత చెప్పించవచ్చు.

ఊరి పరిసరగ్రామాలలో అక్కడక్కడ కొన్ని విగ్రహాలు, ఏర్పాటు చేసి, ఇదుగో ఇక్కడే రుక్మిణిని రథంలోకి ఎక్కించుకొని పోయాడని, ఇక్కడ శిశుపాలుని తన్నాడని, ఇక్కడ జరాసంధుని యుద్ధం చేసి వెనక్కు తరిమేశాడని, ఇక్కడే రుక్మికి గుండుకొట్టి క్షమించి వదిలేశాడని, ప్రచారం చేయవచ్చు. ఆ గ్రామాలలో ఆయా పవిత్ర పౌరాణికస్థలాలను చూపడానికి తప్పకుండా ఆటోలు టాక్సీలు అవసరమౌతాయి. అక్కడ కొబ్బరికాయలు పూలు ఊదినకడ్డీలూ అమ్మే వారు తయారౌతారు. అలా కొందరికి ఉపాధి లభిస్తుంది. వారందరికీ కల్యాణదుర్గమ్మ ఇలవేల్పు అవుతుంది. వారిద్వారా కల్యాణదుర్గమ్మ మహిమలు అందరికీ తెలుస్తాయి. రైలు లైను పూర్తిగా పూర్తై, బెంగుళూరు నుండి ముంబైకో రైలు, హైద్రాబాద్ కో రైలు వయా కల్యాణదుర్గం నడిస్తే, నా సామిరంగా, కల్యాణదుర్గమ్మ ఖ్యాతి దక్షిణభారతానికి, మధ్యభారతానికి, పశ్చిమభారతానికి ప్రాకి, క్రమంగా యావద్దేశంనుండి భక్తులు కుప్పలు కుప్పలుగా ఇక్కడకు రావచ్చు. అదెలా సాధ్యమని సందేహం అక్కర్లేదు. 


 అర్జునుడు తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతం సాధించిన ఇంద్రకీలాద్రి హిమాలయాల్లో ఉందని మహాభారతంలో స్పష్టంగా ఉండగా మనవాళ్లు ఆ పర్వతాన్ని ఏకంగా విజయవాడ కృష్ణానది ఒడ్డుకు పట్టుకురాలేదా? అది సాధ్యమైనపుడు రుక్మిణమ్మ విదర్భలో ఆరాధించిన దుర్గమ్మ గుడి మా కల్యాణదుర్గంలో ఉండటం ఎందుకు సాధ్యం కాదు? దాన్ని పునరుద్ధరించిన ఖ్యాతి ఆ భక్తివ్యాపారికి రావడం ఖాయం!

అలా అర్జునుని స్మృతిచిహ్నం ఒకటి కోస్తా ఆంధ్రలో, కృష్ణుని స్మృతిచిహ్నం ఒకటి రాయలసీమలో ఉంటే ఎంత పర్యాటకప్రశస్తి వస్తుందో కదా! కాశీ చూసిన వాడు రామేశ్వరం చూడాలి, రామేశ్వరం చూసినవాడు కాశీ చూడాలి అనే సెంటిమెంటులాగా విజయవాడ కనకదుర్గమ్మను చూసినవాడు కల్యాణదుర్గమ్మను చూడాలి, కల్యాణదుర్గమ్మను చూసినవాడు విజయవాడ కనకదుర్గమ్మను చూడాలి అనే సెంటిమెంటు పుట్టించడం ఈ కాలపు భక్తి ఛానెళ్లకు చిటికెలో పని!

అలా కాదు, అలా కాదు, అసలు అది కల్యాణదుర్గ కాదు, నిజానికా ఊరి పేరు కల్యాణదర్గ. ఫలానా మైసూరుసుల్తాను ఆస్థానంలో ఉండిన ఒక సాయిబు ఇక్కడ కొండల్లో నివాసం ఏర్పరచుకొని ఉండేవాడు, అతడి కోసం సుల్తాను ఓ దర్గా కట్టించాడు. ఆ దర్గాలో సాయిబు ప్రేమజంటలకు పెళ్లిళ్లు చేసేవాడు, అందువల్ల క్రమంగా ఈ ఊరికి కల్యాణదర్గా అనే పేరు వచ్చిందని మరొకరు మరో కథ లేవదీయవచ్చు.

కల్యాణదుర్గ చరిత్ర అంటూ ఎవడో ఔత్సాహికుడు ఇవ్వన్నీ ఓ పుస్తకంగా వ్రాసేస్తాడు. మరొకడెవడో ఇవే విషయాలను ఉట్టంకిస్తూ ఓ పీ హెచ్ డీ చేస్తాడు. అవన్నీ చరిత్ర సృష్టించడానికి చాలు. అప్పటికి చూడడానికి మనం ఉండకపోవచ్చు, మన దురదృష్టం! మన దేశచరిత్రలో అధికభాగం ఇలా తయారయిందే అని నా ప్రగాఢవిశ్వాసం.

మొత్తానికి ఈ స్టేషను బోర్డుపై ఈ రైల్వేవాళ్ల వ్రాతలు చరిత్రలో క్రొత్తపుటలు ఆవిష్కరింపబడేందుకు అనుకూలంగా ఉన్నాయి. జై రైల్వే వ్రాత!

Follow Us:
Download App:
  • android
  • ios